ప్రజాస్వామ్యంలో ఏ రాజకాయీయపార్టీ లక్ష్యం అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే. అధికారం చేతికి రావాలంటే ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఒకటే మార్గం మన వ్యవస్థలో. అందుకే ఎన్నికలు అంటే రాజకీయపార్టీలు చకోరపక్షుల్లా ఎదురు చూస్తుంటాయి. రాష్ట్రస్థాయి ఎన్నిక కావచ్చు, జిల్లాస్థాయి ఎన్నిక కావచ్చు..చివరకు గ్రామస్థాయి ఎన్నికైనా సరే పోటీకి సిద్ధపడతాయి.
కానీ జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ రూటే సప”రేటు”. 2014 ఎన్నికల్లో పిచ్చిపిచ్చిగా ఊగిపోతూ వీరావేశంతో ఉపన్యాసాలు దంచిన పవన్ తీరా ఎన్నికలు రాగానే తోకను లోపలి ముడిచేసుకుని బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో కుమ్మక్కైపోయి పోటీకి ఎగనామం పెట్టేశాడు. తమ అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్ , ఎంజీయార్, జయలలితలా ముఖ్యమంత్రి అవుతాడు అనుకుంటే కనీసం లోక్ సత్తా పాటి కూడా చెయ్యలేకపోయాడు. ఆ ఎన్నికలతోనే పవన్ కళ్యాణ్ కు భారీ పాకేజీ ముట్టిందని జనం చెవులు కొరుక్కున్నారు. ఇక అప్పటినుంచి చంద్రబాబుకు పాదదాసుడుగా మారిపోయి ఏ ఒక్క ఎన్నికలోనూ పోటీచేసే దమ్ము లేక నమిలేసిన చెరుకు ముక్కలా, రసం పిండేసిన చింతపండులా చివికిపోయాడు.
ఇక 2019 ఎన్నికల్లో “జగన్ ను ముఖ్యమంత్రి కానివ్వను….నాది పాతికేళ్ల రాజకీయ ప్రస్థానం…వందల కోట్ల రూపాయల సినిమా సంపాదన వదులుకుని ప్రజలను ఉద్ధరించడానికి రాజకీయాల్లోకి వచ్చాను…సినిమాల్లో నటించను” అంటూ సొల్లు కబుర్లు చెప్పి అభిమానులను, జనాన్ని కూడా వంచించడం మొదలు పెట్టాడు. పాపం…వెర్రి అభిమానులు పవన్ ఊగుడును చూస్తూ తరించిపోతూ నువ్వే సీఎం నువ్వేసీఎం అంటూ పిచ్చికేకలు పెడుతూ అమ్మోరి పూనకం వచ్చినవారిలా చిందులు వేశారు. తీరా ఎన్నికల తరువాత చూస్తే “కరిమింగిన వెలగపండు” సామెతలా జనసేన ఏకసేన అనిపించుకుంటూ ఒక్కరు గెలిచారు…అది కూడా బొటాబొటీ మెజారిటీతో. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ అతి దారుణంగా పరాభవించబడి జనం చేత తరిమివేయబడ్డాడు. పవన్ కళ్యాణ్ అసలు సత్తా ఏమిటో తెలిసిన జనం పగలబడి నవ్వుకున్నారు! కనీసం అన్నయ్య మాదిరిగా రెండంకెల సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ అసమర్ధత చూసి జాలిపడ్డారు. తనకు ఏమాత్రం విశ్వసనీయత అనేది లేదని ఆ ఎన్నికల్లో పవన్ రుజువు చేసుకున్నారు.
మొన్న దుబ్బాకలో ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో మద్దతు ప్రకటించమని, ప్రచారం చెయ్యమని బీజేపీ కోరినా, కేసీఆర్ పేరు వింటే చాలు నరాలు గడగడా వణికిపోతుండటంతో దుబ్బాక వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒక జాతీయ పార్టీతో మైత్రి ఉన్నప్పుడు కనీసం పొత్తుధర్మాన్ని గౌరవిస్తూ అయినా ఒక్క గంటసేపైనా ప్రచారం చెయ్యాలి. కానీ, పవన్ కళ్యాణ్ తెరమీద హీరో తప్ప నిజజీవితంతో జీరో అన్న సంగతి మనకు తెలుసు కానీ, అభిమానులకు తెలియదు కదా! తీరా అక్కడ బీజేపీ గెలవడంతో సువర్ణావకాశాన్ని పోగొట్టుకున్నట్లయింది.
ఇక జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తామని వారం క్రితం ఆర్భాటంగా ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత బీజేపీతో పొత్తు ఉంటుందని మరో ప్రకటన..కాసేపాగి తమ పార్టీ వారు ఇరవై మంది రంగంలో ఉంటారని మరొక ప్రకటన….తీరా నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయానికి తమ పార్టీ పోటీ చేయడంలేదని మరొక ప్రకటన! “విస్తృత ప్రయోజనాల దృష్ట్యా” తమ పార్టీ పోటీ చెయ్యడం లేదని కవరింగ్! ఎవరి విస్తృత ప్రయోజనాలు అంటూ అభిమానులు ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు. “జనసేన కోసం చెమటోడ్చి, ఇల్లూ ఒళ్ళు గుల్ల చేసుకుని పవన్ కోసం పరితపిస్తే చివరకు మమ్మల్ని మోసం చేస్తారా” అంటూ అభిమానులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ అభిమాన నాయకుడు మళ్ళీ అమ్ముడు పోయాడని బాహాటంగా నిందిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే తెలంగాణ బీజేపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను అసలు ఏ దశలోనూ పట్టించుకోలేదు. ఆయనతో చర్చలు జరపలేదు. పవన్ కళ్యాణ్ కు గడ్డిపోచ విలువ కూడా ఇవ్వలేదు. “పవన్ తో చర్చించేది లేదు…వారితో పొత్తు లేదు ” అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించినపుడే పవన్ కళ్యాణ్ కరివేపాకు కన్నా హీనం అని తేలిపోయింది.
పవన్ కళ్యాణ్, ఆయన అభిమానులు ఇప్పుడు చేయగలిగింది ఒక్కటే…”కొడకా కోటేశ్వరావు…కరుసైపోతవురో” అంటూ కోటేశ్వరావు స్థానంలో తనపేరు పెట్టుకుని పాడుకోవడమే.
“పవన్ బలం ఆయన అభిమానులు. అభిమానుల బలహీనత పవన్ కళ్యాణ్” అని సీనియర్ పాత్రికేయలు, విశ్లేషకులు శ్రీ భండారు శ్రీనివాసరావు గారి అభిప్రాయం అక్షరాలా సత్యం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు