పవన్ కళ్యాణ్ సంసిద్ధత.! దేనికోసం.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్పలేం.! టీడీపీతో కలిసే ప్రసక్తే లేదంటూ.. భారతీయ జనతా పార్టీ ఆ మధ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ‘బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు..’ అంటూ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అప్పట్లో.

కానీ, బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుని ఢిల్లీకి పిలిపించుకుని మరీ మంతనాలు జరిపింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఓ సందర్భంలో చంద్రబాబుతో ఆప్యాయంగా మాట్లాడారు. ‘కలిసి పని చేద్దాం’ అని సూచించారట కూడా అప్పట్లో. అప్పటినుంచే ఈక్వేషన్స్ వేగంగా మారుతూ వచ్చాయి.

అయితే, జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇటీవల ఢిల్లీ వెళ్ళాక.. అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వెంటనే చంద్రబాబుకి ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. ఆ తర్వాత శరవేగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల వరద షురూ అయ్యింది.

ఓ వైపు నిధుల విడుదల, ఇంకో వైపు బీజేపీ నుంచి వైసీపీ మీద రాజకీయ విమర్శలు.. దేన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి. ఇంత గందరగోళం నడుమ, జనసేన అధినేత వారాహి యాత్ర.. ఆ యాత్ర సాక్షిగా, ‘ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి నేను రెడీ’ అని పవన్ కళ్యాణ్ ప్రకటించడం.

సరిగ్గా ఇప్పుడే, ‘ఔను, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే, టీడీపీతో కలవడానికి మాకు అభ్యంతరం లేదు..’ అని బీజేపీ నేతలు చెబుతుండడం.. ఇవన్నీ చూస్తే, పవన్ కళ్యాణ్ సంసిద్ధతకు అర్థమేంటో తెలిసిపోతుంది. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.?

బలమైన సంకేతం బీజేపీ నుంచి వచ్చి వుండకపోతే, పవన్ కళ్యాణ్ ఇంత తెగువగా ముందడుగు వేయరేమో. టీడీపీతో పొత్తు కోసం మాత్రమే కాదు, ముఖ్యమంత్రి పదవి కోసమే పవన్ కళ్యాణ్ సంసిద్ధమైపోయారు.