నిఖార్సయిన పవన్ కళ్యాణ్ అభిమానులెవరైనా, జనసేన పార్టీకే ఓటు వేసి వుంటారు 2019 ఎన్నికల్లో. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి విషయంలోనూ ఇదే జరిగి వుంటుంది. సినీ అభిమానం అంటే అలాగే వుంటుంది. అయితే, ఇక్కడ నిఖార్సయిన అభిమానులు వేరు.. ఆ పేరు చెప్పి పబ్లసిటీ స్టంట్లు చేసేది ఇంకొందరు. ఆ ఇంకొందరి వల్లనే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ దెబ్బతినేసింది.. ఇప్పుడు జనసేన పార్టీ కూడా దెబ్బతినేస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాన్, తాజాగా తిరుపతిలో మాట్లాడుతూ, ‘నన్ను అభిమానించేవారు కూడా వైసీపీకి ఓటేశారు..’ అని వ్యాఖ్యానించడం పెను దుమారం రేపుతోంది పవన్ అభిమానుల్లో. ‘పవన్ అలా ఎలా అనగలిగారు.?’ అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా జనసేన పార్టీకి తాము మద్దతిచ్చామనీ, సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నామనీ.. పవన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు తాము ఆశించలేదనీ వారంతా వాపోతున్నారు. అయితే, ఇలా ఆవేదన వ్యక్తం చేస్తున్నవారంతా ‘వేరే టైపు’ అనీ, వారంతా పవన్ అభిమానుల ముసుగులో జనసేన పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారనీ, జనసైనికుల మధ్య చీలికలు తెస్తున్నారనీ.. జనసేన పార్టీ మద్దతుదారులైన కొందరు నెటిజన్లు చెబుతున్నారు.
రాజకీయాలంటే సవాలక్ష ఈక్వేషన్లు వుంటాయి. స్థానిక పరిస్థితులను బట్టి, రాజకీయాలు అప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఆయా పార్టీల్లోంచి వచ్చిన నేతలకు చివరి నిమిషంలో టిక్కెట్లు ఇవ్వడం వంటి వ్యవహారాలు జనసేన పార్టీకి కొంత మేర నష్టం కలిగించాయి. అలా పవన్ అభిమానులు కొందరు, నిరాశకు గురయ్యారు కూడా. ఇలాంటి విషయాలపై వ్యాఖ్యలు చేసేటప్పుడు పవన్ ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదేమో. ఎందుకంటే, పవన్ కళ్యాణ్‌కి అభిమానులే బలం. ఆ అభిమానులు ఏ కారణం వల్ల అయినా, అసహనానికి గురయితే, జనసేన పార్టీకి ఇప్పుడున్న ఆ కాస్త బలం కూడా లేకుండా పోతుంది. పవన్ ఉద్దేశ్యం ఏదైనా, ఆయన వ్యాఖ్యలు మాత్రం పవన్ అభిమానుల్లో కొందరికి తీవ్ర ఆవేదన మిగిల్చాయి.