తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ వయోపరిమితిపై అయోమయం నెలకొంది. అభ్యర్దుల గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లుగా నిర్దారించడంతో మెజార్టీ అభ్యర్ధులకు దరఖాస్తు చేసుకునే వీలు లేకుండా పోయింది. పంచాయతీ కార్యదర్శుల నియామకాలు డిఎస్సీ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. టిఎస్ పీఎస్సీ చేపట్టే నియామకాలకు 44 ఏళ్లు గరిష్ట వయోపరిమితితో నోటిఫికేషన్ ఇచ్చారు. డిఎస్సీ ద్వారా చేపడుతున్న కార్యదర్శుల నియామకానికి మాత్రం 39 ఏళ్లే ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వయోపరమితి పై స్పష్టతనిస్తూ 2017 జూలై 8న జీవో 190 ని జారీ చేసింది. ఈ ఉత్తర్వుతో అప్పటివరకు ఉన్న గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలు 44 సంవత్సరాలుగా మారింది. ఈ ఉత్తర్వులు 26 జూన్, 2019 వరకు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలుగా మారింది. గత వారం విడుదల చేసిన పంచాయతీ కార్యదర్శుల నోటిఫికేషన్ లో 39 సంవత్సరాలు గరిష్ట పరిమితి పెట్టడంతో అభ్యర్ధుల్లో ఆందోళన నెలకొంది.
తెలంగాణ రాష్ట్రంలో 12,751 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలనే ఉద్దేశ్యంతో నోటిఫికేషన్ రావడంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం వచ్చింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న కార్యదర్శుల పోస్టుల్లో మహిళలకు మూడో వంతు చొప్పున 3158 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు. మిగతా 6197 పోస్టులను జనరల్ కేటగిరిలోకి మార్చారు. సెప్టెంబర్ 3 నుంచి 12 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అప్లై కూడా ప్రారంభం కావడంతో ఏజ్ లిమిట్ సమస్యతో నిరుద్యోగులు అప్లై చేసుకోలేక పోతున్నారు. టిఎస్ పీఎస్సీ నిబంధనల ప్రకారం 44 ఏళ్ల గరిష్ట పరిమితి వెసులుబాటు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు.