సుప్రీంకోర్టులో కేసు విచారణకు వచ్చి, తీర్పు వెలువడేంతవరకు ఎన్నికల విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనబోరని సాక్షాత్తూ పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడంతో ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమీషన్ ఏవిధంగా ముందుకు వెళ్తుందో సందేహంగా మారింది. మరోవైపు ఉద్యోగులు సైతం తమకు కరోనా వెరపు ఉన్నదని, వ్యాక్సినేషన్ జరిగేంతవరకు ఎన్నికల విధులను నిర్వహించబోమని స్పష్టం చేశారు. ఎవరెన్ని అభ్యతరాలు వ్యక్తం చేస్తున్నా కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తన పంతాన్ని ఏమాత్రం వీడకుండా ఉద్యోగులు, అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.
పరిస్థితి చూస్తుంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీమ్ కోర్ట్ తీర్పు వచ్చేలోగానే రాష్ట్రంలోని కీలకమైన అధికారులు అందరిని బదిలీ చేసి లేదా సస్పెండ్ చేసి తన ఆధిక్యాన్ని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఫలానావారిని తొలగించమని, లేదా నియమించామని చీఫ్ సెక్రెటరీని కొరగలరే తప్ప తనంతతానుగా ఏమీ చెయ్యలేరు. నిమ్మగడ్డ ఆదేశాలను అమలు చెయ్యడానికి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. రాను రాను ఇది ఆధిపత్యపోరుగా పరిణమిస్తున్నది.
ఉద్యోగసంఘాల నాయకులు కూడా వేర్వేరు పత్రికాసమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకన్నా తమకు తమ కుటుంబాలు, ఆరోగ్యం ముఖ్యమని, ఎన్నికల కోసం తమ ప్రాణాలను బలిపెట్టలేమని కుండబద్దలు కొడుతున్నారు. మరో రెండు నెలలపాటు ఎన్నికలు వాయిదా వెయ్యాలని కోరుతున్నారు. అలా కాకుండా బలవంతంగా తమ మీద ఎన్నికల విధులను రుద్దితే మూకుమ్మడిగా సెలవు పెడతామని, లేదా సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
నిమ్మగడ్డకు మొదటినుంచి వత్తాసు పలుకుతున్న తెలుగుదేశం నాయకులు కాస్త డోసు పెంచుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం మొదలు పెట్టారు. ఎన్నికలకు వెళ్ళడానికి వైసిపి భయపడుతున్నదని హేళన చేస్తున్నారు. ఇప్పుడు జరిగేవి పంచాయితీ ఎన్నికలు మాత్రమే. వీటికి పార్టీ గుర్తులు ఉండవు. ఒకవేళ తెలుగుదేశం వారు గెలిచినా వారు మా పార్టీవారే అని చెప్పుకున్నా ఎవరూ ఏమీ చేయగలిగేది ఏమీ ఉండదు. నిజానికి పల్లెల్లో పరిస్థితి ఎవరికి అనుకూలంగా ఉన్నదో తెలుగుదేశం వారికి కూడా తెలుసు. కానీ, ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టడమే వారి లక్ష్యం.
ఇలాంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాల్సింది అత్యున్నత న్యాయస్థానమే. సోమవారం నాడు విచారణ జరిగితే ఎలాంటి తీర్పు వస్తుందో అని ప్రభుత్వం, ఎన్నికల కమీషన్ మాత్రమే కాక ప్రజలకు కూడా ఉత్కంఠగానే ఉన్నది. సుప్రీమ్ కోర్ట్ ఎలాంటి తీర్పు ఇచ్చినా, ఉభయపక్షాలు మన్నిస్తారని ఆశిద్దాం.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు