‘ఆపరేషన్ సిందూర్’ విజయం తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా స్పందించింది. ఉగ్ర స్థావరాలపై భారత్ ఎత్తుకున్న దూకుడు పాక్‌కు బాగా తగలినట్టుంది. మోదీ మాట్లాడుతూ, “ఇది పూర్తి కాదు.. కేవలం విరామం మాత్రమే” అన్న హెచ్చరికలు ఇస్లామాబాద్‌ను ఆందోళనలో ముంచాయి.
తాజాగా పాక్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, “భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. మేము కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం. ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడేందుకు మార్గాలు వెతుకుతున్నాం” అని చెప్పింది. అయితే ఇది మేము బలహీనులమన్న అర్థంలో కాదు. దురాక్రమణ జరిగితే తగినదానికి తగిన స్పందన ఇస్తామని పాక్ హెచ్చరించింది.
కాగా మంగళవారం పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో మోదీ మరోసారి పాక్‌ను హితవు పలికారు. “భారత్ శాంతిని కోరుకుంటుంది, కానీ దాడి జరిగితే ఊరుకోదు. మన భద్రత విషయంలో మేము ఏమాత్రం వెనక్కి తగ్గం” అని పేర్కొన్నారు. గతంలో పాకిస్థాన్ ప్రేరేపించిన ఉగ్రదాడులు ఏ విధంగా ఎదురయ్యాయో గుర్తు చేశారు.
ఇక రాజకీయ, సైనిక వర్గాల్లో మోదీ వ్యాఖ్యలపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇది మరోసారి పాక్‌పై భారత దృఢమైన సంకల్పాన్ని చాటిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో పాక్ మరొకసారి ప్రేరేపిత దాడులకు పాల్పడితే తట్టుకోవడం అసాధ్యమని చెప్పడంలో మోదీ స్పష్టంగా ఉన్నారని విశ్లేషణ. మొత్తం మీద, మరో మాటల యుద్ధానికి తెరతీసిన మోదీ స్పీచ్ ఈ ప్రాంతంలో భవిష్యత్తు దిశను నిర్దేశించనుంది.