ఇష్టమైన ఫుడ్ మన ఎదురుగా ఉన్నప్పుడు.. దానిని చూస్తూ ఒక్కసారిగా భోజనాన్ని ఆపలేకపోవడం చాలామందిలో కనిపించే విషయం. ఆకలి తీరినా ఆ టేస్ట్ వదిలి పెట్టలేక ఇంకొంచెం తినాలనిపించడం సహజం. అయితే ఈ అలవాటవుతుంటే శరీరానికి పెను ముప్పు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అవసరానికి మించి తినడం వల్ల (ఓవర్ ఈటింగ్) క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుందన్న విషయాన్ని ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ తరంగ్ కృష్ణ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
అతిగా తినడం వల్ల శరీరంలో ఫ్యాట్ స్థాయిలు పెరిగి ఊబకాయం వస్తుంది. ఇది క్యాన్సర్ సహా అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడం, హార్మోన్ల అసమతుల్యత, కణాల నాశనం వంటి ప్రభావాల ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలకు దారితీస్తుందన్నారు. అంతేకాదు, జీర్ణవ్యవస్థపై కూడా అధిక ఒత్తిడి పడుతుంది. అన్నీ జీర్ణం చేయడానికి శరీరం ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. దీని వల్ల ఫ్రీ రాడికల్స్ అనే హానికర పదార్థాల ఉత్పత్తి పెరిగి, అవే క్యాన్సర్‌కు బీజం వేస్తాయని చెబుతున్నారు.
అతిగా తినే అలవాటు షుగర్ రిస్క్‌ను కూడా పెంచుతుంది. ఎక్కువగా తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఫుడ్ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. దీని ప్రభావంగా బాడీ ఎక్కువ ఇన్సులిన్ విడుదల చేయాల్సి వస్తుంది. దీన్ని తిప్పి చూసుకుంటే కొన్ని రకాల క్యాన్సర్లతోనూ సంబంధం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే, కొన్ని చిన్న అలవాట్లు పాటించాలి. భోజనం ముందు నీళ్లు తాగడం, ఆహారాన్ని బాగా నమలడం, చిన్న ప్లేట్‌లో తినడం వంటి చిట్కాలు సహాయపడతాయి. శరీరం ఇచ్చే ‘నిండింది’ అనే సంకేతాన్ని పట్టుకోవాలి. నిజంగా ఆకలివల్లే తింటున్నామా లేక ఒత్తిడి, బోరు వల్లనా అనే అంశాన్ని కూడా గుర్తించాలి.
అలాగే డైట్‌లో పోషకాహారాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే తక్కువ కేలరీలతో ఎక్కువ న్యూట్రిషన్ దొరుకుతుంది. అంతేకాదు, కడుపు నిండిన ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ చిన్న అలవాట్లతో ఓవర్ ఈటింగ్‌ను నియంత్రించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి.. కడుపు నిండిన సంతృప్తి కోసం వేసే ఒక్క మెడికి.. ఆ తర్వాత ఆరోగ్యంపై వచ్చే దెబ్బలు ఎన్నో ఉండొచ్చు. తినేటప్పుడు శరీరానికి అవసరమైనంత మాత్రానే తీసుకోవడం ముఖ్యమన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి.
