BrahMos Cruise Missile: మన బ్రహ్మోస్ ప్రభావం గట్టిగానే.. రష్యాలో భారత రాయబారి!

రక్షణ రంగంలో భారత్-రష్యాల మధ్య సంబంధాలు కొత్త దిశగా దూసుకెళ్తున్నాయని, భారత తయారీ ఆయుధాల సామర్థ్యం సరిహద్దుల్లో నిరూపితమైందని రష్యాలో భారత రాయబారి వినయ్ కుమార్ పేర్కొన్నారు. ఓ రష్యన్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి వంటి ఆయుధాలు ప్రభావవంతంగా పనిచేశాయని వివరించారు.

ఇది కేవలం కొనుగోళ్లలోనే కాక, ఉత్పత్తి, అభివృద్ధి, మార్పిడి సహకారంతో కూడిన బలమైన భాగస్వామ్యమని ఆయన అన్నారు. “భారత శక్తి ప్రదర్శనలో ఈ ఉత్పత్తుల పాత్ర ఎంతో కీలకం. ఈ సమయంలో భారత్‌లో తయారైన ఆయుధాలు ఎలా సమర్థంగా పని చేశాయో ప్రతిభావంతంగా వెల్లడయ్యింది” అని చెప్పారు. బ్రహ్మోస్‌ మాదిరిగానే రాబోయే రోజుల్లో మరిన్ని సంయుక్త ప్రాజెక్టులకు అవకాశం ఉందని సూచించారు.

రష్యాతో కొనసాగుతున్న రక్షణ సంబంధాలపై మాట్లాడుతూ, అన్ని సాంకేతిక, సైనిక అంశాలపై సంప్రదింపులు సాగుతూనే ఉన్నాయని, ఇది ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకు దోహదం చేస్తుందని తెలిపారు. పహల్గామ్ దాడి అనంతరం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చర్యలకు రష్యా పూర్తిగా మద్దతుగా నిలిచిందన్నారు.

కశ్మీర్ అంశంపై మూడో పక్షం జోక్యం అవసరం లేదన్న భారత్ వైఖరి స్పష్టమైనదని, ఇదే దృక్కోణాన్ని భారత్ ఇప్పటికీ కొనసాగిస్తోందన్నారు. అంతేకాదు, ఉక్రెయిన్ వివాదానికి శాంతియుత పరిష్కారం కోసం చర్చలు జరగాలని మోదీ చెప్పిన మాటలను పునరుద్ఘాటించారు. “భారతదేశం అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉంది. కానీ శాంతి కోసం మొదటి మెట్టు సంబంధిత పక్షాల నుంచే రావాలి” అని ఆయన స్పష్టం చేశారు.