అనుకున్నంతా అయ్యింది…”ఆర్‌ఆర్‌ఆర్” కు ఆస్కార్‌ ఘనత మోడీదేనట!

ఏ ఎండకా గొడుకు పట్టడం బీజేపీకి వెన్నతో పెట్టిన విధ్య అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపణ అయ్యింది. అది తమ జీన్స్ అని వారు చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కరలేని పరిస్థితి. విజయేంద్రప్రసాద్ కథ అందించగా.. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్. సినిమాలో.. కీరవాణి స్వరాలు సమకూర్చగా.. చంద్రబోస్ రాసిన పాట “నాటు నాటు”కు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే!

పైన చెప్పుకున్న ఏ పేరులో అయినా.. మోడీ పేరుందా? అమిత్ షా అస్తం ఉందా? నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైన బీజేపీ నేతలు… తాజాగా ఆర్.ఆ.ఆర్. కు ఆస్కార్ రావడం వెనక ఘనత మోడీదేనని.. ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ స్థాయిలో ఉంటాయని చెప్పేసుకుంటున్నారు.

ఆర్.ఆర్.ఆర్. సినిమాలోని “నాటు నాటు” పాటకు ఆస్కార్ అవార్డు రావడం తమ గొప్పతనమే అని చెప్పుకోవడానికి బీజేపీ చిత్ర విచిత్ర విన్యాసాలు నిస్సిగ్గుగా చేస్తుంది. బీజేపీ ఇలా చేయడానికి ఏమాత్రం సిగ్గు పడదనే విషయాన్ని పలువురు రాజకీయ నాయకులు ఇప్పటికే చెప్పారు కూడా.

ఈ విషయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ… “మోడీ వల్లనే ఈ అవార్డు వచ్చిందని వాళ్ళు ప్రచారం మొదలు పెట్టినా పెడతారు” అని అన్నారు.

ఇక తాజాగా రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. “నాటు నాటు” పాటకు లిరిక్స్ మోడీయే రాశారని, ఆ ఘనత మొడీదే అని దయచేసి చెప్పకండి” అని బీజేపీ నాయకులకు వ్యంగ్యంగా విజప్తి చేశారు.

తిట్టుకీ పొగడ్తకీ తేడా తెలియక పోవడం వల్లో… నిజానికీ – వెటకారానికీ వ్యత్యాసం కనుక్కోలేకపోవడం వల్లోకాని… ఆర్.ఆర్.ఆర్. కు ఆస్కార్ రావడంలో మోడీ ఘనత కచ్చితంగా ఉందని మైకందుకున్నారు బీజేపీ మంత్రి పీయూష్ గోయల్! ఆయన అజ్ఞానాన్ని చూసి జాలిపడాలో.. ఆయన అత్యుత్సాహాన్ని చూసి అసహ్యించుకోవాలో తెలియక నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అవును… ఎవరికో పుట్టిన బిడ్డను తమ బిడ్డ అని చెప్పుకోవడంలో అత్యుత్సాహం చూపించాలని తొందరపడ్డారో ఏమో తెలియదు కానీ… ఎవరెన్ని అనుకుంటే మాకేంటి అన్నట్టు బీజేపీ నాయకుడు పియూష్ గోయల్ అన్నంత పని చేశారు! ఆర్.ఆర్.ఆర్. మూవీ స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను కేంద్ర బీజేపీ సర్కార్ కొద్ది రోజుల ముందు రాజ్యసభకు నామినేట్ చేసింది. దాన్ని గుర్తు చేస్తూ… కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్… రాజ్యసభకు మోడీ ఎలాంటి వారిని నామినేట్ చేస్తారో, ఆ విషయంలో ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తారో ట్రిపుల్ ఆర్ కు ఆస్కార్ రావడమే గొప్ప ఉదహరణ అని ట్వీట్ చేశారు.

దీంతో.. పీయుష్ గోయల్ ట్వీట్ పై నెటిజన్లు ఒక ఆటాడుకుంటున్నారు. వారి స్పందనలో కొన్ని ఇప్పుడు చూద్దాం!

“విజయేంద్ర ప్రసాద్ మూవీ కథ రాశారు. ఆస్కార్ గెలిచిన ‘నాటు నాటు’ పాట రాసింది ఆయన కాదు. లిరిక్, స్క్రిప్ట్ ల మధ్య వ్యత్యాసం పీయుష్ గోయల్ వంటి మేధావి మంత్రికి అర్థం కావడం చాలా కష్టం!”

“ఖర్గే అన్నారంటే అనరా మరి… కనీసం ఆయన రిక్వస్ట్ ని కూడా మోడీ & కో పట్టించుకోలేదు”!

“నెటిజన్లు ఎన్ని తిట్టినా, ఎంత వెటకారం ఆడినా… తిట్టుకీ పొగడ్తకీ తేడా తెలియని జ్ఞానం బీజేపీ నాయకుల సొంతం… వారే సుమా దేశాన్ని పాలిస్తుంది… భారతీయుడా గర్వపడు”!

“ఆ అవార్డ్ కు ‘మోస్కార్’ అని పేరు పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.”