రోజూ “ఓం” జపం చేస్తే.. శరీరంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసా..?

ఆధునిక జీవితంలో ఒత్తిడి, ఆందోళన, మానసిక గందరగోళం చాలా మందికి.. తమ జీవితంలో భాగమైంది. రోజువారీ పనులు, పోటీ ప్రపంచం, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టంగా మారింది. అయితే ప్రాచీన కాలం నుంచి ధ్యానం, యోగా సాధనలో ప్రధాన పాత్ర పోషించిన ఓం అనే జపం ఈ సమస్యలకు మంచి పరిష్కారంగా మారుతుందని పండితులు చెబుతున్నారు.

“ఓం” శబ్దం సాధారణ పదం కాదు. సృష్టి సారాన్ని ప్రతిబింబించే ఈ పవిత్ర మంత్రాన్ని హిందూమతం మాత్రమే కాకుండా బౌద్ధం, జైనిజం, సిక్కిజం వంటి అనేక మతాలు ఆచరిస్తాయి. ఇది మూడు అక్షరాల కలయిక.. అ, ఉ, మ. జాగృత స్థితి, స్వప్న స్థితి. మనిషి జీవితంలోని మూడు ప్రధాన దశలను సూచించే ఈ శబ్దం, శరీరానికి, మనస్సుకు, ఆత్మకు సమతుల్యతను అందిస్తుంది.

ప్రతిరోజూ “ఓం” జపం చేసే వారిలో మానసిక స్థితి స్థిరంగా మారుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. శబ్ద తరంగాల వల్ల మెదడు రిలాక్స్ అవుతుంది. దాంతో ఆందోళనలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. విద్యార్థులకు ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వృద్ధులలోనూ మెదడు చురుకుదనం మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

ఆరోగ్యపరంగా కూడా “ఓం” జపం ఎంతో ప్రయోజనకరం. దీని సమయంలో తీసుకునే గాఢ శ్వాసలు రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతాయి. హృదయం బలంగా మారి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరిగి తరచుగా వచ్చే జలుబు, జ్వరాలు తగ్గుతాయి. చర్మానికి కూడా ఇది మేలు చేస్తుంది. రక్తప్రసరణ మెరుగై సహజమైన కాంతి ముఖంలో ప్రతిబింబిస్తుంది.

నిద్ర సమస్యలతో బాధపడేవారికి “ఓం” జపం సహజ ఔషధంలా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు 10-15 నిమిషాలు శాంతంగా కూర్చొని దీన్ని ఉచ్చరించడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. గాఢ నిద్ర లభిస్తుంది. అయితే ఈ జపం చేసే పద్ధతీ అంతే ముఖ్యమైనది. స్నానం చేసిన తర్వాత ప్రశాంత వాతావరణంలో కళ్లును మూసుకుని దీర్ఘ శ్వాసలతో “ఓం”ను మెల్లగా ఉచ్చరించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మొదట్లో దృష్టి కేంద్రీకృతం కాకపోయినా నిరంతరం సాధన చేస్తే మనస్సు సహజంగా ప్రశాంతతను పొందుతుంది.

ఉదయం ఖాళీ కడుపుతో లేదా రాత్రి నిద్రకు ముందు కనీసం 21 సార్లు “ఓం” ఉచ్చరించడం ఉత్తమమని యోగాచార్యులు చెబుతున్నారు. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన జీవనానికి ఒక సహజ మార్గమని వైద్యులు కూడా అంగీకరిస్తున్నారు. మనిషి జీవితంలో ప్రశాంతత, ధైర్యం, ఆరోగ్యం అనేవి అత్యంత అవసరమైనవి. ఈ మూడింటినీ సమతుల్యం చేసే ఒక అద్భుత సాధనం “ఓం” జపం. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచే దీన్ని దినచర్యలో భాగంగా చేసుకోండి. చిన్న ప్రయత్నమే అయినా దీని ఫలితాలు జీవితాన్ని కొత్త దారిలో నడిపించగలవు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)