శరీరానికి కావాల్సిన సమగ్ర పోషకాలు మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటాయి. కానీ ఆధునిక జీవనశైలి, విశ్వాసాలు, ఆరోగ్య పరిరక్షణ కారణాలతో చాలామంది నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని పూర్తిగా మానేస్తున్నారు. శాకాహారం ఆరోగ్యకరమే అయినప్పటికీ, నాన్ వెజ్ ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టడం శరీరానికి కొన్ని కీలకమైన పోషకాల లోపం కలిగించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సంపూర్ణ ఆరోగ్యం కోసం కొంత మేర నాన్ వెజ్ ఆహారం తీసుకోవడం అవసరమని అంటున్నారు.
ప్రోటీన్ అనేది శరీరానికి అత్యంత కీలకం. నాన్ వెజిటేరియన్ ఆహారాల్లో ఉండే సంపూర్ణ ప్రోటీన్లు కండరాల బలాన్ని, శక్తిని పెంచుతాయి. వీటి లోపం వల్ల కండరాల బలహీనత, జుట్టు ఊడటం, తక్కువ శక్తి స్థాయిలు, తరచుగా జబ్బులు పడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే జంతు ఆధారిత ఆహారాల్లో ఉండే విటమిన్ B12 లేకపోతే నరాల సమస్యలు, రక్తహీనత, అలసట, మెమరీ సమస్యలు రావచ్చు.
అదే విధంగా నాన్ వెజ్ ఆహారాల్లో లభించే హీమ్ ఐరన్ కూరగాయల్లో లభించే “నాన్-హీమ్ ఐరన్” కంటే సులభంగా శోషించబడుతుంది. ఇది లేకపోతే తలనొప్పులు, మతిమరుపు, శ్వాస సమస్యలు తలెత్తవచ్చు. అలాగే చేపల్లో లభించే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే గుండె సంబంధిత వ్యాధులు, మానసిక డిప్రెషన్, మెదడు అభివృద్ధి మందగించడం వంటి సమస్యలు వచ్చే అవకాశముంది.
జింక్, క్రియేటిన్ కూడా ప్రధానంగా జంతు ఆధారిత ఆహారంలోనే లభిస్తాయి. వీటి లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, కండరాల బలహీనత, గాయాలు ఆలస్యంగా నయం కావడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిపుణుల సూచన ప్రకారం పూర్తిగా నాన్ వెజ్ మానేయకూడదు. కనీసం వారంలో రెండు సార్లు చేపలు, గుడ్లు లేదా మాంసం తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. శాకాహారంతో పాటు సమతుల ఆహారం తీసుకోవడం వల్లనే శరీరానికి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే నాన్ వెజ్ పూర్తిగా మానేస్తే ఆరోగ్యాన్ని మిస్ అవ్వాల్సిందే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
