తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు మూడు రోజులపాటు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో, ఎక్సైజ్ శాఖ అధికారులు ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఎన్నికలు రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉపాధ్యాయ స్థానానికి, అదే ప్రాంతంలో పట్టభద్రుల స్థానానికి, అలాగే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మరో ఉపాధ్యాయ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం మద్యం అమ్మకాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో భాగంగా మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల తర్వాత మద్యం దుకాణాలు మళ్లీ తెరుచుకుంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, ఈ మూడు రోజులపాటు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.