సీక్రెట్ గా స్టార్ట్ చేసేసిన బాబు… సగానికిపైగా పూర్తైపోయిందంట!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహమో.. లేక అంతకంటే ముందే ముందుజాగ్రత వహించారో తెలియదు కానీ… సీక్రెట్ గా ఒక పనిమాత్రం మొదలుపెట్టేశారని.. అందులోనూ సగానికిపైగా పూర్తిచేసేశారని తెలుగుదేశం సర్కిల్స్ లో ఒక టాక్ నడుస్తుంది. ఇంతకూ ఆ పని ఏమిటంటే… అభ్యర్థుల ఎంపిక!

చాలాకాలం తర్వాత చంద్రబాబు తెలివిగా ఆలోచిస్తున్నారంట. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ఉన్న బాబు.. అందుకు అవసరమైన తొలి పని, అభ్యర్థుల ఎంపికను సీక్రెట్ గా కానిచ్చేస్తున్నారంట. అధికారికంగా ప్రకటిస్తే వైసీపీ నుంచి కౌంటర్ అటాక్స్ ఉంటాయనో ఏమో కానీ ప్రస్తుతానికి అఫీషియల్ గా వెల్లడించకుండా.. వ్యక్తిగతంగా అభ్యర్థులను పిలిచి.. “మీకు టిక్కెట్ కన్ ఫాం.. ప్రచారం చేసుకోండి” అని చెబుతున్నారంట.

అవును… ప్రస్తుతం బాబు అదేపనిలో ఉన్నారని, పాదయాత్రలో భాగంగా లోకేష్ ప్రకటిస్తున్న అభ్యర్థుల పేర్లు కూడా అందులో భాగాలే అని అంటున్నారు తమ్ముళ్లు. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారు 90 నియోజకవర్గాలలో పార్టీ టికెట్లను చంద్రబాబు కన్ఫర్మ్ చేశారని టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. వీటిలో ఒక్క ఉత్తరాంధ్రలోనే సుమారు 30 సీట్లను ఖరారు చేసినట్లు చెప్తున్నారు.

ఇక రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే వీరమరణమే అని నమ్ముతూ చంద్రబాబు పొత్తుకోసం అర్రులుచాస్తున్న జనసేన కోసం ఆలోచించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా టిక్కెట్లు ఖరారు చేయలేదని, ఇందులో భాగంగానే ఉత్తరాంధ్రలోనూ 3 – 4 సీట్లు జనసేన కి ఇవ్వడానికి పెండింగులో ఉంచారని అంటున్నారు.

ప్రస్తుతం ఫలానే స్థానమే కావాలని డిమాండ్ చేసే పరిస్థితి జనసేనకు లేదు.. ఆ డిమాండ్ కు తల వంచాల్సిన అవసరం బాబుకు అస్సలే లేదు కాబట్టి… టీడీపీకి బలం లేని స్థానాలు జనసేన చేతిలో పెట్టేస్తున్నారంట. ఫలితంగా ఆ సీట్లలో జనసేన గెలిస్తే బోనస్.. ఓడిపోతే.. ఎలాగూ ముందుగా అనుకున్నవే కాబట్టి నో ప్రాబ్లం అని బాబు ఆలోచిస్తున్నారంట.

కాగా టికెట్లు ఖరారు కావడంతో 90 నియోజకవర్గాలలో టీడీనీ నేతలు ఇప్పటికే ప్రచారం స్పీడు పెంచారని, తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారని అంటున్నారు తమ్ముళ్లు. మరి మిగిలిపోయిన కొన్ని సీట్లు మిత్రపక్షానికి ఇవ్వాలని భావిస్తున్న బాబు… వాటిపై కూడా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని, పవన్ కి పంపేస్తే… ఆ సీట్లలో వారి వారి అభ్యర్థులను పవన్ ఫిల్ చేసుకుంటారని చెబుతున్నారంట టీడీపీ కార్యకర్తలు!