బొత్స, ధర్మాన.. బాధ్యత తీసుకోరేం.?

మంత్రి బొత్స సత్యనారాయణ, మరో మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఇంకో మంత్రి సీదిరి అప్పలరాజు.. ఇలా ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులెవరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. అందునా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీ ఓడిపోవడానికి సంబంధించి బాధ్యత తీసుకోవడంలేదు. అసలంటూ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈ విషయమై ఇంతవరకూ ఎవర్నీ నిలదీసినట్లు కనిపించడంలేదు. సమీక్ష అంటూ వైసీపీలో జరిగిందా.? జరుగుతుందా.? అన్నదానిపైనా స్పష్టత లేదు.

మిగతా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్ని కోల్పోవడం వేరు.. ఉత్తరాంధ్రలో ఓటమి వేరు.! మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ‘విశాఖను రాజధాని చేయకపోతే, ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్టం ఇచ్చెయ్యాలి..’ అంటూ డిమాండ్ చేశారు. ఈయనే న్యాయ వ్యవస్థపై అసెంబ్లీలో చర్చ జరిగేందుకు కారణమయ్యారు.

ఉత్తరాంధ్ర హక్కులన్నారు.. విశాఖ రాజధాని అన్నారు.. ధర్మాన చేతులెత్తేశారు. పూర్తిగా ఆయన అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్ళిపోయినట్టుంది పరిస్థితి. మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మరీనూ.! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తన అనుభవాన్ని పార్టీ కోసం ఉపయోగించిందే లేదు.

ఇక, మంత్రి సీదిరి అప్పలరాజు విషయానికొస్తే, చాలామంది గ్రాడ్యుయేట్లు.. ఆయన అవినీతిపై స్లిప్పులు రాసి మరీ, పోలింగ్ బూతుల్లో ఓటరు స్లిప్పుతోపాటు వేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా.. ఆయా మంత్రులపై వైసీపీ అధినేత చర్యలు తీసుకోకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.