పవన్ – చంద్రబాబులకు పులివెందుల వెల్ కం!

గతకొన్ని రోజులుగా ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ “వైనాట్ 175” అనే స్లోగన్ ఎత్తుకున్నారు. ఈసారి 175 స్థానాలకు గానూ 175 స్థానాలు గెలవాలని, తలచుకుంటే జరుగుతుందని, ప్రభుత్వ పథకాలను మరింత విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గడపగడపకూ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని కోరుతున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగానే పనులు చేసుకుంటూ పోతున్నారు.

ఈ సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. అనంతరం నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు చేసిన పనివల్ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలకు గానూ టీడీపీ ఒకస్థానం గెలుచుకుంది. దీంతో… నిన్నమొన్నటివరకూ వెంటిలేటర్ పై ఉన్న పార్టీ కాస్తా ఫాం లోకి వచ్చినట్లు మాట్లాడుతుంది. ఫలితంగా చంద్రబాబు కూడా “వైనాట్ 175” అని అనడం స్టార్ట్ చేశారు.

అవును… ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కలిగించిన వాపును చూసుకుని బలుపుగా భావిస్తున్నారో ఏమో కానీ… 175 స్థానాలు ఖచ్చితంగా గెలిచి తీరుతామని అంటున్నారు చంద్రబాబు. అదే “అతి” అని తమ్ముళ్లే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్న ఈ తరుణంలో… “వై నాట్ పులివెందుల” అనే అంశం కూడా తెరపైకి తీసుకొచ్చారు బాబు. అసలు ఇది అర్ధం లేని లాజిక్. అల్ రెడీ 175 నియోజకవర్గాలు టార్గెట్ పెట్టుకుని, ఆల్ మోస్ట్ గెలిచేసాం అన్నంత కాన్ ఫిడెంట్ గా ఉన్న తర్వాత మళ్లీ… వైనాట్ పులివెందుల, వైనాట్ గుడివాడ, వైనాట్ బందర్ అనడం ఏమిటో బాబుగారికే తెలియాలి.

ఈ సమయంలో మైకందుకున్న వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని… పవన్ – చంద్రబాబులకు ఒక సూచన చేశారు. వైనాట్ 175 అంటున్న చంద్రబాబు.. అసలు సొంతంగా ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అది కూడా వద్దులే.. అని ఆఫర్ ఇచ్చిన పేర్ని నాని… “వైనాట్ పులివెందుల” అనే వారిని ఆహ్వానిస్తున్నామని.. చంద్రబాబు – పవన్ లు పులివెందులలో పోటీచేయాలని సూచించారు. జగన్ కు పోటీగా చంద్రబాబు – పవన్ లు పులివెందులలో పోటీచేస్తే… మీరో మేమో తేలిపోతుందని సలహా ఇచ్చారు.

దీంతో… నిజమే కదా! ప్రతీసారీ బీటెక్ రవినో, మరో నేతనో బలిచేయడం ఎందుకు… ఈసారి జగన్ కు తన సత్తా ఏమిటో చూపించే క్రమంలో… చంద్రబాబే నేరుగా పులివెందులలో పోటీచేసి జగన్ ని ఓడిస్తే సరిపోతుందిగా అంటున్నారు నెటిజన్లు. ఇక ఎలాగూ రెండు చోట్ల పవన్ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు కాబట్టి… రాయలసీమ జిల్లాలో పులివెందుల నియోజకవర్గాన్ని ఎంచుకుంటే “పవర్” ఏమిటో తేలిపోద్దిగా అని చెబుతున్నారు. ఇదేదో బాగానే ఉంది. అధినేతలిద్దరూ ఆలోచిస్తారో లేదో వేచి చూడాలి!

YouTube video player