తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాజాగా ఇంకో సర్వే వెలుగు చూసింది. ఈ సర్వేలో, అధికార భారత్ రాష్ట్ర సమితికి 75కి పైగా అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయట. కాంగ్రెస్ పార్టీ కొంత మేర పుంజుకున్నా 35 సీట్లకే పరిమితమవుతుందట. భారతీయ జనతా పార్టీ సింగిల్ డిజిట్ సీట్లతోనే సరిపెట్టుకోనుంది. మజ్లిస్ పార్టీ తన కోటా సీట్లను గెలుచుకోనుందన్నది తాజా సర్వే సారాంశం.
అయితే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో రాజకీయాలు పూటకోలా మారిపోతున్నాయ్. ప్రముఖ రాజకీయ నాయకులు అటూ ఇటూ దూకుతున్నారు. నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి దూకితే, వివేక్ భారతీయ జనతా పార్టీకి గుడ్ బై చెప్పారు.
బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే దూకేసిన సంగతి తెలిసిందే. బలమైన నాయకుల చుట్టూ వివిధ రాజకీయ పార్టీలు తిరుగుతున్న తీరు, నేతలు పార్టీలు మార్చేస్తున్న తీరు.. అత్యంత హాస్యాస్పదంగా తయారైంది.
ఎన్నికల ముందర, ఎన్నికలయ్యాక నాయకులు పార్టీలు మారడంలో వింతేమీ లేదు. కానీ, మరీ ఇంతలాగానా.? పొద్దున్న ఓ పార్టీ, సాయంత్రం మరో పార్టీ, రాత్రికి మరో పార్టీ.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
ఇలా పార్టీలు మారుతున్న నాయకుల్లో కొందరికి, ఆయా పార్టీల నుంచి గట్టిగానే ముడుపులు అందుతున్నాయి. టిక్కెట్లు దక్కకపోయినా, నాయకులు పార్టీలు మారుతుండడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ అంశం. టిక్కెట్లు వచ్చినోళ్ళూ పార్టీలు మార్చేస్తుండడం మరింత ఆసక్తికరం.
వీ6 ఛానల్ అధినేత వివేక్, బీజేపీకి షాక్ ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది.