కొత్త పార్లమెంటు భవనం జాతికి అంకితం చేయబడింది. నరేంద్ర మోడీ హయాంలో ఈ పార్లమెంటు భవన నిర్మాణం ప్రారంభమై, పూర్తయి.. అందుబాటులోకి వచ్చింది. ఇకపై పార్లమెంటు సమావేశాలు ఈ కొత్త భవనంలో జరగనున్నాయి.
పార్లమెంటు అంటే, ప్రజాస్వామ్యానికి ప్రతీక.! దేశ ప్రజల ఆత్మగౌరవం.! వ్యక్తులకు, పార్టీలకు చెందినది కాదిది. దేశ ప్రజలకు చెందినది. దేశ ప్రజలకు సంబంధించి చట్టాలు చేసేందుకు ఇదొక వేదిక.!
కానీ, దురదృష్టం.. వ్యక్తి చుట్టూ జరుగుతోంది పార్లమెంటు ప్రసహనం. ‘సెంగోల్’ మీద ఎంత రాజకీయ రాద్ధాంతం జరుగుతోందో చూస్తున్నాం. సెంగోల్ అంటే రాజదండం. దీన్ని ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ, కొత్త పార్లమెంటులో ప్రతిష్టించారు.
మోడీ చేతిలోనే రాజదండం.. ఇది రాచరికం.. అంటూ రచ్చ జరుగుతోంది. అదే సమయంలో, గతంలో రాజదండాన్ని, రాచరికానికి నిలువెత్తు నిదర్శనంగా వాడారంటూ కాంగ్రెస్ మీదా విమర్శలు వస్తున్నాయ్.
రాజకీయ పార్టీలు వస్తుంటాయ్.. పోతుంటాయ్.. ప్రధానులు మారుతుంటారు.. చట్ట సభల్లో ప్రజా ప్రతినిథులు మారుతుంటారు.. కానీ, వ్యవస్థ ఎప్పటికీ అలాగే వుంటుంది. ముందే చెప్పుకున్నట్టు, ఇది వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. దేశానికి సంబంధించిన విషయం.
ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే.. ఈ కొత్త పార్లమెంటు, నిఖార్సయిన రీతిలో ప్రజా సమస్యలపై చర్చకు, పరిష్కారాలకు వేదిక కావాల్సి వుంటుంది. అవుతుందా మరి.?