సామాన్యుడు మాట్లాడటం మొదలుపెడితే ఎలా ఉంటుంది? సామాన్యుడు ఎదురుతిరిగి ధైర్యం చేస్తే ఎలాగుంటుంది? సామాన్యుడు పాలకులను ప్రశ్నించడం మొదలుపెడితే ఎలా ఉంటుంది?… ఎలా ఉంటుందో చూపించారు తెలంగాణ ప్రజలు. మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షాలు కురిపించారు. తాము ప్రశ్నించడం మొదలుపెడితే ఏ జర్నలిస్టూ అడగని స్థాయిలో… ఏ ప్రతిపక్షమూ విమర్శించని రీతిలో ఉంటుందని నిరూపించే ప్రయత్నం చేశారు.
అవును… మంత్రి కేటీఆర్ పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా పైర్ అయ్యారు. దళితులకు మూడు ఎకరాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? దళితులకు ఎంత మందికి దళితబంధు ఇచ్చారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంలో అరుణ్ అనే నెటిజన్ స్పందిస్తూ… “దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ? నిరుద్యోగ భృతి ఎక్కడ? దళితబంధు అసలు ఎక్కడ? ఎంతమందికి ఇచ్చారు? కరీంనగర్ ను లండన్ చేస్తా అన్నాడు.. ఎక్కడ కనిపిస్తుంది? ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఎక్కడ ఇచ్చారు? ఇంకా చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. వట్టిగా బిత్తిరీ మాటలు మాట్లాడకు” అంటూ పైర్ అయ్యారు.
ఇక “జాతీయ హోదా ఇవ్వాలంటే కేంద్ర జలసంఘం నిబంధనలకు అనుగుణంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినాడా కేసీఆర్?.. అంటే వచ్చే సమాధానం లేదు. మరి అవి ఏవీ లేకుండా ఉత్తిపుణ్యానికే హోదా ఇచ్చి ప్రజల పైసలు కేసీఆర్ లెక్క వృథా చేయమంటావా?” అంటూ అనిల్ రెడ్డి అనే నెటిజన్ ప్రశ్నించారు.
ఇదే సమయంలో… “ఒక పేదవాడిని.. ఇళ్లు లేని వాడిని.. పక్కా టీఆరెస్స్ కార్యకర్తని.. మెదక్ జిల్లా నర్సాపూర్ డబుల్ బెడ్రూం ఇళ్లు త్వరగా పూర్తి చేసి.. మీరు పట్టించుకోని మా నర్సాపూర్ కు ఒక్కసారి వచ్చి, చూసి అధికారులకు చెప్పి పోతారని ఒక పేదవాడిగా ఆశిస్తున్నా” అని ప్రభుత్వ ఫెయిల్యూర్ ని ఎత్తిచూపుతూ… రిక్వస్ట్ చేశారు అక్బర్ మోహ్మద్!
“దళిత సీఎం, లక్షరూపాయల రుణమాఫీ, ఉద్యోగాల భర్తీలో కాంట్రాక్టు తీసేసి రెగ్యులరైజేషన్, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూం, ఇళ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు, రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు? నిరుద్యోగ భృతి, 24 గంటల ఉచిత కరెంటు ఏదీ?”.. అంటూ విజయ్ అనే యువకుడు ప్రశ్నల వర్షాలు కురిపించాడు.
ఈ క్రమంలో” తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వం.. విద్య ఇవ్వం.. ఆరోగ్యం ఇవ్వం.. రైతు భీమా ఇవ్వం.. మహిళలకు భద్రత ఇవ్వం.. సీఎం దృష్టిలో అసలు ప్రజలే లేనప్పుడు తెలంగాణలో బీఆరెస్స్ ఎందుకు ఉండాలి? మీ బూటకపు మాటలు మేమెందుకు వినాలి?” అంటూ నిప్పులు చెరిగారు రాకేష్ అనే నెటిజన్!
ఇలా మంత్రి కేటీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు నెటిజన్లు. ప్రజలు ప్రశ్నిస్తున్నారనో, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయనో కాదుకానీ… చెప్పిన మాట – ఇచ్చిన హామీ నెరవేర్చని రాజకీయాలు ఎందుకు.. ఆ నాయకుడు ఎందుకు? అనే కామెంట్లు ఈ సందర్భంగా కనిపిస్తున్నాయి!