హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ వివాదం మరో మలుపు తిరిగింది. కబ్జా చేసిన భూమిని సినీ హీరో నాగార్జున స్వయంగా ప్రభుత్వానికి అప్పగించి నిజమైన హీరోలా నిలిచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలిలో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ మాట్లాడారు.
మాదాపూర్‌లోని తుమ్మిడి చెరువులో ఎన్ కన్వెన్షన్ అక్రమంగా నిర్మాణాలు చేపట్టిందని గతంలో ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. హైడ్రా బృందం 2024, ఆగస్టు 24న కూల్చివేత చేపట్టింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో దాదాపు 1.30 ఎకరాలు, అదనంగా బఫర్ జోన్‌లో 2 ఎకరాలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. హైడ్రా కూల్చివేతల తర్వాత నటుడు నాగార్జున స్వయంగా ముందుకు వచ్చి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారని సీఎం రేవంత్ చెప్పారు. అక్రమం జరిగినట్లు అంగీకరించి, కబ్జా భూమిని తిరిగి అప్పగించడం నిజమైన హీరోకే సాధ్యమని సీఎం కొనియాడారు.
నగరంలో అనేక చెరువులు, నాళాలు కబ్జా అయ్యాయని, వాటిని తిరిగి పొందేందుకు హైడ్రా బలంగా పనిచేస్తోందని సీఎం తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలను బీఆర్ఎస్ చేస్తున్నారు అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కి భవిష్యత్తులో అత్యాధునిక సౌకర్యాలు అందించాలని, ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. ‘‘40 ఏళ్లుగా ఈ నగరానికి నాకు అనుబంధం ఉంది.. నగర అభివృద్ధిపై పూర్తి అవగాహన ఉంది’’ అని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం అభివృద్ధిని అడ్డుకునే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని సీఎం హామీ ఇచ్చారు.