పేర్ని నానికి ఓరల్ డయేరియా మందుల్ని సూచించిన నాగబాబు

రాజకీయాల్లో విమర్శల తీవ్రతకు ఆకాశమే హద్దుగా మారిపోయింది. వైసీపీ, టీడీపీ నేతలు ఏ స్థాయిలో తిట్టుకుంటున్నారో నిత్యం చూస్తూనే వున్నాం. మీడియాకెక్కి బూతులు తిట్టుకోవడం ఓ యెత్తయితే, సోషల్ మీడియా వేదికగా మరింత చెత్తను విదుల్చుతున్నారు.

జనసేన పార్టీ కూడా ఇందుకు అతీతమేమీ కాదు. కాకపోతే, జనసేనకు మీడియా కవరేజ్ వుండటంలేదంతే. తాజాగా, జనసేన నేత నాగబాబు, మాజీ మంత్రి పేర్ని నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన మీద పేర్ని నాని తాజాగా చేసిన విమర్శలపై, నాగబాబు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఎటాక్ చేశారు.

వైసీపీలో కొందరు నేతలు ఓరల్ డయేరియాతో బాధపడుతున్నారన్నది నాగబాబు విమర్శ. ఓరల్ డయేరియా అంటే, నోటి విరేచనాలని అర్థమట.! ఇది మరీ టూమచ్ కదా.? పవన్ కళ్యాణ్ వీకెండ్ ప్రజా సేవ చేస్తున్నారని పేర్ని నాని ఎద్దేవా చేయడమే కాదు, దత్త పుత్రుడనీ, ఇంకోటనీ పేర్ని నాని ఘాటైన విమర్శలు చేసేశారు.

పవన్ కళ్యాణ్ రెండు చోట్లా ఓడిపోయారనీ పేర్ని నాని ఎద్దేవా చేసిన దరిమిలా, నాగబాబు నుంచి ఇలా ట్వీటాస్త్రాలు దూసుకొచ్చాయన్నమాట.

‘పవన్ కళ్యాణ్ ఒకింత సాత్విక ఆహారం వైసీపీ నేతలకు పెట్టాలనీ, జీర్ణంకాని రీతిలో తిండి పెడుతోంటే వైసీపీ నేతలకు అది జీర్ణం కావడంలేదనీ’ నాగబాబు ట్వీటేశారు. పేర్ని నానికి దగ్గరలో ఎవరైనా వైద్యుడు వుంటే, ఓరల్ డయేరియాకి మందులు ఇవ్వాలని కూడా నాగబాబు సూచించారు. దీనిపై వైసీపీ శ్రేణులూ గట్టిగానే రిటార్ట్ ఇస్తున్నాయి.