Vrusshabha Movie Review: ‘వృషభ’ మూవీ రివ్యూ!

రచన- దర్శకత్వం : నంద కిషోర్
తారాగణం : మోహన్ లాల్న సమర్జిత్ లంకేష్, నయన్ సారిక, రాగిణీ ద్వివేది, అజయ్ సక్సేనా తదితరులు
సంగీతం : శ్యాం సీ ఎస్, ఛాయాగ్రహణం : ఆంటోనీ శాంసన్, కూర్పు : కేఎం ప్రకాష్
బ్యానర్స్ : బాలాజీ మోషన్ పిక్చర్స్, కనెక్ట్ మీడియా, అభిషేక్ వ్యాస్ స్టూడియోస్
నిర్మాతలు : శోభా కపూర్, ఏక్తా కపూర్ తదితరులు
విడుదల : డిసెంబర్ 25, 2025

Vrusshabha Movie Review: 2025లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరుసగా మూడు విజయాలతో వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. ‘ఎంపురాన్’, తో ఘనంగా ప్రారంభించి, మరో ఘనవిజయం ‘తుడారుమ్’ మీదుగా, ‘హృదయపూర్వం’ కొచ్చి హ్యాట్రిక్ కొట్టాడు. ఇప్పుడు క్రిస్మస్ కి ‘వృషభ’ ఈ సంవత్సరం తను నటించిన నాల్గో మూవీ. మరి దీంతో తన విజయాల పరంపర కొనసాగించాడా? ప్రేక్షకులకి ఆకట్టుకునే అంశాలు అంశాలు ఇందులో ఏమేం వున్నాయి? ఇవి తెలుసుకుందాం…

కథేమిటి?
ఈ కథ రెండు కాలాల్లో జరుగుతుంది, ఒకటి వర్తమానంలో, మరొకటి సుదూర గతంలో. వర్తమానంలో ఆది దేవ వర్మ (మోహన్ లాల్) శక్తివంతమైన వ్యాపారవేత్త. ఇతడికి తరచూ పూర్వ జన్మ జ్ఞాపకాలేవో వెన్నాడుతూంటాయి. కథ క్రమంగా అతడి గత జన్మ రూపమైన విజయేంద్ర వృషభని రివీల్ చేస్తుంది. ఇతనొక శక్తివంతమైన రాజు, యోధుడు కూడా. అయితే ఇతను చేసిన కొన్ని పనులు శాపమై వెన్నాడుతున్నాయి. ఈ గత సంఘటనల ప్రభావం వర్తమానంపై, ముఖ్యంగా విజయేంద్రకీ, అతడి కుమారుడు తేజ్ (సమర్జీట్ లంకేష్) కీ మధ్య సంబంధాల్ని ప్రశ్నార్ధకం చేస్తాయి. దీనికి పరిష్కారాన్ని కనుగొనే క్రమంలో ఈ కథ పునర్జన్మ, విధి, వారసత్వం వగైరా ఆధ్యాత్మిక కోణాల్ని స్పృశిస్తుంది. మన గత జన్మలో పాల్పడిన చర్యలు వర్తమానాన్ని ఎలా రూపొందిస్తాయో చూపిస్తుంది.

ఎలా వుంది కథ?
నంద కిషోర్ రచించి దర్శకత్వం వహించిన ‘వృషభ’ పునర్జన్మతో ముడిపడిన ఒక శాపం ఎలా తండ్రీ కొడుకుల సంబంధాలకి విఘాతం కల్గించిందన్న ఆసక్తికర పాయింటు తోనే వుంది. దీన్ని ఫాంటసీ డ్రామాగా ప్రెజెంట్ చేశాడు. అయితే దీనికి కథనం, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, పాత్రచిత్రణలూ చాలా హాస్యాస్పదంగా వున్నాయి. సినిమా ప్రారంభయ్యింది మొదలు ముగిసే వరకూ బోరు కొట్టని క్షణం లేదు. దీన్ని మోహన్ లాల్ ఎలా ఒప్పుకున్నాడా అన్నది అంతు చిక్కని మిస్టరీ.

ఈ సినిమా తండ్రి కొడుకుల సంబంధంతో మొదలవుతుంది, కానీ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంతగా వుండదు. కొడుకు తన తండ్రి నునుపైన చెంపల్ని రాగి ఇడ్లీలతో, కండరపుష్టిని ప్రోటీన్ షేక్‌తో పోలుస్తూ చెప్పే హాస్యాస్పదమైన డైలాగులు ఎదురవుతాయి. కొడుకు తేజ్- దామిని (నయన్ సారిక) ఒకరినొకరు ప్రేమించుకుంటూ చెప్పుకునే మాటలు కూడా అంతే హాస్యాస్పదంగా వున్నాయి.

గత జన్మలో రాజు వృషభతో కూడా సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. ఇంత హాస్యాస్పదంగా దర్శకుడు ఈ సినిమా రాసి తీయడం తమాషాగా వుంది. ఈ తమాషా చూడడానికైతే రెండు గంటల బోరు భరించ వచ్చు. కేవలం 2 గంటల 7 నిమిషాల రన్‌టైమ్‌తో ఎంతో కాలం గడిచిపోయినట్టు అన్పిస్తుంది. ఈ సినిమా భావోద్వేగ కేంద్రంగా వుండాల్సిన తండ్రీకొడుకుల సంబంధాలు కూడా ఫ్లాట్ గా వుంటాయి. కథ ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉంటుందంటే, ఇదొక ఐతిహాసిక ఫాంటసీయా, పునర్జన్మ డ్రామానా అన్న స్పష్టత వుండదు. అని నిర్ణయించుకోలేని కథనంలో మునిగిపోయింది.

ఎవరెలా చేశారు?
మోహన్ లాల్ ఆధునిక వ్యాపారవేత్తగా ఆకర్షణీయంగా ఉంటాడు. రాజు వృషభగా యుద్ధ సన్నివేశాలలో అవసరమైన ఎమోషన్స్ ని ప్రదర్శిస్తాడు. అయితే ఈ పాత్రకి కూడా డెప్త్ లేదు- విధి శపించిన గొప్ప యోధుడికి శాపం కథకూడా బలీయంగా వుండదు.

మర్జిత్ లంకేష్ పాత్రలో తేజ్ పేలవంగా రూపొందిన పాత్రతో స్ట్రగుల్ చేయడమే కన్పిస్తుంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే ఇవి నాసిరకంగా వుంటాయి. అసంబద్ధ సంభాషణలతో లక్ష్యం లేని ఈ కథకి ఇతర సాంకేతిక నిపుణులు కూడా నిర్లక్ష్యంగా పని చేశారు. మలయాళం నుంచి వచ్చిన సినిమా ఇంత వరస్ట్ ఉంటుందని ఎవరూ ఊహించరు. ప్రేక్షకులకి ఆకట్టుకునే అంశాల కోసం చూస్తే- సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే గత జన్మ కథే. ఇది తప్ప ఈ సినిమాకి బాక్సాఫీసు అప్పీల్ అనేది ఏదీ లేదు.

రేటింగ్ : 2 / 5

చంద్రబాబు స్కిల్ కేసు రి ఓపెన్ || Journalist Bharadwaj About Chandrababu Skill Development Case ||TR