ఇద్దరూ రాజకీయ నాయకులే.. ఇద్దరూ కలిసి దేవుడి నెత్తిన శఠగోపం పెట్టేశారు. ఒకరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఇంకొకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బిక్కవోలు గణపతి ఆలయం ఇందుకు వేదికయ్యింది. గత కొంతకాలంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికీ, వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ‘నువ్వు దోచేశావ్..’ అని ఒకరంటే, ‘కాదు, నువ్వే దోచేశావ్..’ అంటూ ఇంకొకరు ఎదురుదాడికి దిగారు. ఇలా ఇద్దరూ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడమే కాదు, మధ్యలోకి వాళ్ళ వాళ్ళ భార్యల పేర్లనీ తీసుకొచ్చారు. పేకాట క్లబ్బులు, గ్రావెల్ దోపిడీలు.. ఇలా చాలా అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడిచి.. ‘సత్య ప్రమాణం’ సవాల్ దాకా వెళ్ళింది. దాంతో, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
పటిష్ట బందోబస్తు నడుమ.. ఇద్దరు నాయకులూ, దేవాలయంలోకి ప్రవేశించారు. అక్కడ మళ్ళీ రచ్చ.. ఒకరి మీద ఒకరు మళ్ళీ దుమ్మెత్తిపోసుకున్నారు. ఎలాగైతేనేం, ఇద్దరూ ‘సత్య ప్రమాణం’ చేసేశారు. అది సత్య ప్రమాణమా.? అసత్య ప్రమాణమా.? అన్నది వేరే చర్చ. దేవుడి గుడిలోకి వెళ్ళాక ‘నిశ్శబ్దంగా వుండాలి’ అన్న ఇంగితం ఇద్దరికీ లేకుండా పోయింది. దేవుడ్ని తాకేసి మరీ సత్య ప్రమాణాలు చేసేశారు. దేవుడు రాయి రూపంలో వున్నాడు కాబట్టి సరిపోయింది.. లేదంటే, దేవుడి పరిస్థితేంటో.! ‘నేను చెప్పిందే నిజం.. ఆయన చెప్పింది అబద్ధం..’ అని ఇద్దరూ ప్రమాణం చేసేశారు. బయబటకొచ్చాక, ‘ఆయన సరిగ్గా ప్రమాణం చేయలేదు..’ అంటూ ఒకరి మీద ఒకరు మళ్ళీ ఆరోపణలు చేసుకున్నారు.
వివాదం దేవుడి కోర్టులోకి వెళ్ళింది. దేవుడు తేల్చుతాడు ఎవరు తప్పు చేశారో. దానికి తగిన శిక్ష కూడా విధిస్తాడన్నది బిక్కవోలు గణపతి భక్తుల వాదన. ఇటు వైసీపీలోనూ, అటు టీడీపీలోనూ ఇప్పుడు అందరిదీ అదే భయం. ఏదో రాజకీయ ఆవేశంతో ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసేసుకున్నారుగానీ.. ‘పవర్ ఫుల్ గాడ్’ అయిన వినాయకుడి మీద ప్రమాణం చేసేస్తారా.? అని తూర్పుగోదావరి జిల్లా జనమే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ‘సత్య ప్రమాణాల’ మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినా, దేవుడికే శఠగోపాలు పెట్టే రాజకీయ నాయకులున్న కాలమిది. దేవుళ్ళకి రాజకీయ నాయకులు నిజంగానే భయపడి, సత్య ప్రమాణాలు చేసి.. నిజాలు చెప్పేస్తే.. వ్యవస్థలెందుకు ఇలా తగలడతాయి.?