కొన్నాళ్ళ క్రితం ఓ వైసీపీ ఎమ్మెల్యే చుట్టూ ‘పార్టీ మారతారు’ అన్న ప్రచారం జరిగింది. ఆయన గతంలో ఎంపీగా పనిచేశారు కూడా. ఆయన వ్యవహార శైలి ఒకింత చిత్రంగా వుంటుంది. ఉన్నత విద్యావంతుడు, ఉన్నతమైన ఉద్యోగం కూడా చేసి రిటైరయ్యారు ఆయన. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాల్ని ఇటీవల ఆయన ఖండించారు కూడా. ఆయనే, ఎమ్మెల్యే వరప్రసాద్. మళ్ళీ, ఇప్పుడు ఈయన పార్టీ మారతారనే ప్రచారం ఇంకాస్త గట్టిగా జరుగుతోంది.
ఆ ఎంపీ సీటు, ఈయనకు మళ్ళీ దక్కేనా.?
తిరుపతి ఎంపీగా గతంలో పనిచేసిన వరప్రసాద్, మళ్ళీ తిరుపతి ఎంపీ అవబోతున్నారట. ఆయనకు పలు పార్టీలు గాలం వేస్తున్నాయట. చాన్నాళ్ళ క్రితం ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి తిరుపతి ఎన్నికల బరిలోకి దిగారు.. ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీ నుంచి ఆయన లోక్‌సభకు ఎంపికైన విషయం విదితమే. ప్రస్తుతం బీజేపీ – జనసేన కూటమి నుంచి ఆయనకు పిలుపు వచ్చిందని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే, వరప్రసాద్‌కి ప్రత్యేకమైన అభిమానం. దాంతో, ఆయన్ను బుజ్జగించడం తేలికేనని బీజేపీ భావిస్తోందట.
ససేమిరా అంటున్న వరప్రసాద్
జరుగుతోన్నదంతా దుష్ప్రచారమేననీ, తనకు తిరుపతి ఉప ఎన్నిక పట్ల ఏమాత్రం ఆసక్తి లేదని చెబుతున్నారట తన సన్నిహితులతో వరప్రసాద్. ‘పార్టీలో ఎవరు సహకరించినా, సహకరించకున్నా.. అధినేత వైఎస్ జగన్ పట్ల నమ్మకంతోనే వుంటాను. అసలు నేను ప్రజా ప్రతినిథి అయ్యిందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన వైసీపీకి ఎందుకు వెన్నుపోటు పొడుస్తాను.?’ అని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో వరప్రసాద్ చెప్పారు.
నిప్పు లేనిదే పొగ వస్తుందా.?
రాజకీయాల్లో నిప్పు లేకుండా కూడా పొగ వచ్చేస్తుంటుంది. అలా పొగ వచ్చాక, నిప్పు రాజుకునే అవకాశాలు కూడా ఎక్కువే. మరి, ఈ ప్రచారం పట్ల వైసీపీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.