గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టకపోవడంపై కూటమి ప్రభుత్వంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, “అప్పుడేం చేశారు గాడిదలు కాశారా?” అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం: మెడికల్ కళాశాలల నిర్మాణం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) మోడల్‌లోనే జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఐదు వేల కోట్ల పనులకు కేవలం ఐదు వందల కోట్ల పనులు మాత్రమే చేసిందని, కేవలం పులివెందులలో మాత్రమే మెడికల్ కళాశాలను పూర్తి చేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పది మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో పూర్తి చేస్తుందని ప్రకటించారు. దీని ద్వారా డెబ్భై శాతం పేద విద్యార్థులకు మేలు జరుగుతుందని, యాజమాన్య హక్కులు, నిర్వహణ మొత్తం ప్రభుత్వం చేతిలోనే ఉంటాయని వెల్లడించారు.

జగన్ బెదిరింపులకు తగ్గబోం: జగన్ బెదిరింపులకు ఎవరూ తగ్గేది లేదని మంత్రి అన్నారు. ఆయన కాలేజీలు వచ్చి కట్టే వరకు విద్యార్థులు నష్టపోయారని మండిపడ్డారు. “జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కల,” అని వ్యాఖ్యానించిన ఆయన, “వైసీపీ వచ్చేది లేదు.. చచ్చేది లేదు,” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అభివృద్ధిని అడ్డుకుంటే బుద్ధి చెబుతారు: ఇంకా అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ఉద్దానం విషయంలో కూడా రాద్దాంతం చేస్తున్నారని, ఇలా చేస్తే ఈసారి 11 సీట్లు కూడా రావన్నారు. ప్రజలు చిత్తుగా ఓడించినందుకు జగన్ కక్ష కట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్డు పడుతున్నారని, అన్ని విషయాలు ప్రజలు గమనిస్తున్నారని, వాళ్లకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్టీఆర్ వైద్య సేవలపై చర్చిస్తున్నామని, అన్నీ సర్దుకుంటాయని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

