పోలవరం ప్రాజెక్టు విషయమై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టతనిచ్చారు. ఏ ప్రాజెక్టులోనూ తొలుత పూర్తిస్థాయి నీటి నిల్వ జరగదనీ.. మొదటి ఏడాది, రెండో ఏడాది.. ఇలా పెంచుకుంటూ పోవడం జరుగుతుందనీ మంత్రి అనిల్ స్పష్టతనివ్వడంతో, పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయమై జరుగుతున్న గందరగోళానికి తెరపడ్డట్టయ్యింది. పోలవరం ప్రాజెక్టుని తాజాగా మంత్రి అనిల్ సందర్శించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీపై ఆయన విరుచుకుపడ్డారు.
ఇంతకీ ఈ ఎత్తు గోలేంటి.?
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45 మీటర్లకు పైన డిజైన్ చేశారు. కానీ, అక్కడ ప్రస్తుతానికి సుమారు 41 మీటర్ల వరకే నీటి నిల్వకు అవకాశం వుంటుందంటూ వార్తలు వెలుగు చూశాయి. అందుకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఇటీవల అధికారులతో జరిగిన సమీక్షలోనూ మాట్లాడినట్లు వైసీపీ అనుకూల మీడియాలోనూ కథనాలొచ్చాయి. వైసీపీ సొంత మీడియాలో ఈ తరహా కథనాలు వచ్చాక, అనుమానాలు పెరగకుండా ఎలా వుంటాయ్.?
జాతీయ ప్రాజెక్టు ఎత్తు తగ్గించే స్థాయి రాష్ట్రానికి వుందా.?
పోలవరం అనేది జాతీయ ప్రాజెక్టు. దాంతో, ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం అనేది రాష్ట్రానికి సాధ్యం కాకపోవచ్చు. అయితే, కేంద్రం నిధుల విషయంలో కొర్రీలు పెడుతుండడంతో అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి, అధికారులకు సూచనలు ఇవ్వడాన్ని తప్పు పట్టలేం. అయితే, జరుగుతున్న గందరగోళంపై ప్రభుత్వం అధికారికంగా వివరణ అత్యంత వేగంగా ఇచ్చి వుంటే ఇంత గందరగోళానికి కారణమయ్యేది కాదు.
ప్రాజెక్టు ఎత్తుని టేపుతో కొలుచుకోవచ్చునట..
ప్రాజెక్టు ఎత్తుని ఎవరైనా టేపుతో కొలుచుకోవచ్చంటూ మంత్రి అనిల్ చెబుతున్నారు. ఆయన ఉద్దేశ్యం ఏదైనప్పటికీ, పోలవరం ప్రాజెక్టు అనేది ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి. ఇచ్చిన మాట ప్రకారం పోలవరం ప్రాజెక్టుని 2021 నాటికి పూర్తి చేయగలిగితే.. వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ చారిత్రక ఘనతను సొంతం చేసుకున్నట్లవుతుంది. అయితే, ఇక్కడ నిధుల సమస్య ప్రాజెక్టుని అయోమయంలో పడేస్తున్న దరిమిలా, కేంద్రం నుంచి ‘కొర్రీలు’ లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.