ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో ఆసక్తికరమైన మార్పు చోటుచేసుకుంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి రెండో స్థానాన్ని అందుకున్నారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా గణాంకాల ప్రకారం, జుకర్‌బర్గ్ నికర సంపద ప్రస్తుతం 212 బిలియన్ డాలర్లుగా ఉంది, ఇక బెజోస్ సంపద 209 బిలియన్ డాలర్లుకి పరిమితమైంది.
మే 5న జరిగిన ట్రేడింగ్‌లో జుకర్‌బర్గ్ సంపద 846 మిలియన్ డాలర్లు పెరగగా, అదే రోజు బెజోస్ సంపద 2.9 బిలియన్ డాలర్లు తగ్గింది. మెటా షేర్లు గత నెలలో 16.2% పెరిగినప్పటికీ, అమెజాన్ షేర్లు కేవలం 6.3% మాత్రమే పెరగడం ఈ మార్పుకు దోహదం చేసినట్లు తెలుస్తోంది.
మెటా ఇటీవల ప్రకటించిన బలమైన ఫలితాలు కూడా జుకర్‌బర్గ్ సంపదను పెంచే కీలక కారకమయ్యాయి. తొలి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 42.31 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఇది మార్కెట్ అంచనాలను మించిపోయింది. రెండో త్రైమాసికానికి 42.5 నుంచి 45.5 బిలియన్ డాలర్ల మధ్య టార్గెట్ ప్రకటించారు.
ఇక ఈ జాబితాలో మొదటి స్థానాన్ని ఎలాన్ మస్క్ అలంకరించుకుంటున్నారు. ఆయన నికర సంపద ప్రస్తుతం 331 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ల మీద దృష్టిని పెంచుతున్న మస్క్… గత నెలలోనే 7.5 బిలియన్ డాలర్లు సంపద పెంచుకున్నారు. ఈ మార్పులతో ప్రపంచ సంపద మ్యాప్ మరోసారి రూపాంతరం చెందింది. టెక్ దిగ్గజాల మధ్య ధన సమీకరణలు ఎలా మారతాయో చూడాలి.