అంగరంగ వైభవంగా జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ వివాహం.. మూడు రోజుల పెళ్లి ముచ్చట..!

ప్రపంచ ధనవంతుడిగా పేరొందిన అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఆయన ప్రేయసి లారెన్ సాంచెజ్ వెనిస్‌లో తమ పెళ్లి వేడుకతో ఘనంగా జరుపుకుంటోంది. శుక్రవారం నుంచి వెనిస్‌లోని ప్రసిద్ధ గ్రాండ్ కెనాల్ ఒడ్డున ఉన్న విలాసవంతమైన అమన్ హోటల్‌లో ఈ జంట బస చేసింది. ఈ వెనిస్‌లో, శాన్ గియోవన్నీ ఎవాంజెలిస్టా అనే చిన్న ద్వీపంలోని విల్లా బాస్లినీ తోటల్లో వీరి పెళ్లి వేడుక జరుగుతోంది.

గురువారం ప్రారంభమైన వేడుకల్లో ప్రత్యేక అతిథులకు విందు ఏర్పాటు చేశారు. శనివారం తుది పార్టీతో ఈ పెళ్లి సందడి ముగియనుంది. ఇటాలియన్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, ద్వీపంలోని ఓ పెద్ద బహిరంగ యాంఫిథియేటర్‌లో పెళ్లి కార్యక్రమం జరగనుందని సమాచారం. పెళ్లి వేడుకల అనంతరం ప్రముఖ ఒపెరా గాయని ఆండ్రియా బోసెల్లి కుమారుడు మాటియో బోసెల్లి పెళ్లికూతురు, పెళ్లివారికి ప్రత్యేక సెరినేడ్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది.

లారెన్ సాంచెజ్ ఈ వేడుకల కోసం ఏకంగా 27 విభిన్న దుస్తులను సిద్ధం చేసిందట. వీటిలో సగం వరకు ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్లే డిజైన్ చేశారు. మరోవైపు ఈ రాయల జంట తమ పెళ్లి వేడుకల్లో భాగంగా వెనిస్ నగరానికి దాదాపు 30 కోట్ల రూపాయలు (3.5 మిలియన్ డాలర్లు) విరాళంగా ఇస్తున్నారని వెనెటో ప్రాంతీయ అధ్యక్షుడు లూకా జైయా ప్రకటించారు.

ఈ పెళ్లి కోసం ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖ అతిథులు వెనిస్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే నటాషా పూనవాలా, ఇవాంకా ట్రంప్‌ లాంటి ప్రముఖులు ఈ వేడుకల్లో కనిపించారు. ఇవాంకా ట్రంప్ తన వెనిస్ ట్రిప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, నటాషా పూనవాలా కూడా పెళ్లి బాష్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నటాషా పూనవాలా అందానికి సాంచెజ్ కూడా ఫిదా అయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే బెజోస్ పెళ్లి వేడుకకు ప్రతిగా వెనిస్‌లో కొందరు పర్యావరణవేత్తలు నిరసన చేపట్టారు. ‘నో స్పేస్ ఫర్ బెజోస్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, నగరంలోని ప్రధాన కాలువలు, పర్యాటక ప్రాంతాలను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. పెళ్లికి రావడానికి పలువురు అతిథులు మార్కో పోలో విమానాశ్రయంలో ప్రైవేట్ జెట్లను కూడా బుక్ చేసుకున్నారు. కనీసం 95 ప్రైవేట్ విమానాలకు ల్యాండింగ్ అనుమతులు కోరారట. గతంలో జర్నలిస్టు, యాంకర్‌గా పనిచేసిన లారెన్ సాంచెజ్ 2018 నుంచి బెజోస్‌తో డేటింగ్ చేస్తున్నారు. 2019లో భార్య మెకంజీ స్కాట్‌తో విడాకులు తీసుకున్న బెజోస్, గతేడాది లారెన్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.