రామా కనవేమిరా…: మందులపై పడ్డ మోడీ!

తన గురించి, గుజరాత్ లో తాను సాగించిన పాలన గురించి తెలిసికూడా రెండు సార్లు అధికారం కట్టబెట్టిన ప్రజలపై రివేంజో.. లేక. సామాన్యుడి సమస్యలు, కుటుంబ కష్టాలు తెలిసే అవకాశం లేని పరిస్థితో.. కారణం కరెక్ట్ గా తెలియదు కానీ… సామాన్యుడిపై ప్రధాని కక్ష కట్టేశారు.. ప్రజలపై మోడీ పగ పట్టేశారు.. అనే కామెంట్లు ఆన్ లైన్ వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. దానికి కారణం.. మోడీకి పెద్దలపై ఉన్న ప్రేమలో 10శాతం కూడా పేద ప్రజలపై లేకపోవడం అనే సమాధానాలు వస్తున్నాయి.

అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలతో సంబంధం లేకుండా.. పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుడి “చమురు” వదిల్లించేస్తున్న మోడీ… తాజాగా హైవే ఎక్కితే బాదేస్తానంటూ టోల్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచేశారు. అడిగేవాడు లేడనే ధైర్యమో.. అడిగినవారి నోరు ఎలా నొక్కేయాలనే విద్య తెలుసన్న నమ్మకమో తెలియదు కానీ… ఆఖరికి ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు కూడా పేంచేసింది మోడీ సర్కారు.

గడిచిన తొమ్మిదేండ్లలో దేన్నీ వదలకుండా ధరల్ని పెంచుతూపోయిన కేంద్రం.. ఇప్పుడు ఔషధాల ధరలకూ రెక్కల్ని తొడగనుంది. దేశంలోని 90 శాతం జనాభాపై ప్రభావం చూపేలా.. మందుల ధరలనూ భారీగా పెంచబోతుంది. ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు సైతం 12 శాతం పెంచి, సామాన్యులకు వైద్యాన్ని మరింత ప్రియం చేయాలని ఫిక్సయ్యింది కేంద్రప్రభుత్వం. అవును… నిన్నటివరకూ వంటగ్యాస్‌ ధరలు పెంచి వంటింట్లో మంటపెట్టిన మోడీ… ఇప్పుడు మందుల ధరలు పెంచి ఒంట్లో మంట పెట్టాడు!

గ్యాస్, బియ్యం, పప్పులు, నూనెలు.. ఇలా గృహోపయోగ వస్తువుల ధరలన్నీ పెరిగిపోయి సతమతమవుతున్న సామాన్యుడిపై మరో బండ వేయాలని.. అది కూడా ఏప్రిల్ 1వ తేదీనుంచి అమలుచేయాలని నిర్ణయించుకుంది. వీటిలో పెయిన్‌ కిల్లర్, యాంటీ బయోటిక్స్‌ వంటి సాధారణ మందులు మొదలుకొని.. గుండె జబ్బుల్లో వాడే మందుల దాకా అన్నీ ఉన్నాయి. అంటే… దాదాపు 800 అత్యవసర మందులపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందంట. అంటే… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ మందుల ధరలు దాదాపు 60 శాతం వరకు పెరిగాయన్నమాట!

దీంతో… “కార్పొరేట్ల రుణాలను ఎడాపెడా రద్దు చేస్తారు. ప్రజల సొమ్మును దోచుకొనే వారికి అండగా ఉంటారు. సామాన్యుడి జీవితాన్ని ప్రభావితం చేసే రోజువారీ అవసరాలైన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసరాలు, మందుల ధరలను మాత్రం ఎడాపెడా పెంచుతారు. అసలు సామాన్యుడు ఈ దేశంలో బతుకొద్దా?” అంటూ ఆన్ లైన్ లో ఆవేదన చెందుతూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు! శ్రీరామనవమి రోజున కన్నీళ్లు పెట్టించే ఇలాంటి కానుకిస్తారా?… రామా చూశావా మోడీ డ్రామా? అంటూ మరో నెటిజన్ సెటైర్ వేస్తున్నారు!