నల్లగొండ బిసి నేతలకు మహా కూటమి పొగ

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా మహా కూటమి పురుడు పోసుకున్నది. మహాకూటమిలో పైకి కనబడే పార్టీలు కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, తెలంగాణ జన సమితి. కానీ లోపల కనిపించని శక్తులేమిటో అందరికీ తెలిసిందే. కూటమిలోని అన్ని పార్టీల్లో అగ్రవర్ణ నాయకులే ఉన్నారు. ఏం చేసైనా తెలంగాణలో అగ్రవర్ణ వెలమ కేసిఆర్ ను దింపి రెడ్డి సిఎం కావాలన్న లక్ష్యంతో రెడ్డి సామాజిక చైతన్యం వెల్లివిరుస్తున్నది.  ఈ తరుణంలో మహా కూటమిలో నూటికో, కోటికో ఉన్న బిసి లీడర్లకు అనివార్యంగా కూటమిలో పొగ పెడుతున్న వాతావరణం కనబడుతున్నది. నల్లగొండ జిల్లాలో కూటమి అభ్యర్థులుగా బరిలోకి దిగాల్సిన ఇద్దరు బిసి లీడర్లకు కూటమిలోని రెడ్డి నేతలే పొగ పెడుతున్నట్లు ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఆ వివరాలు చదవండి.

తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత నల్లగొండ మూడు ముక్కలైంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి గా అవతారం ఎత్తింది. కొత్త జిల్లాలను పెద్దగా ఎవరూ లెక్కలోకి తీసుకోవడంలేదు కాబట్టి ఉమ్మడి జిల్లానే పరిగణలోకి తీసుకుందాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అంటేనే రెడ్లు అనే వాతావరణం ఉంది. తెలంగాణలో ఏ జిల్లాలో లేనంతగా రెడ్డి నేతలు నల్లగొండ రాజకీయాల్లో స్థిరపడిపోయారు. అంతెందుకు కాంగ్రెస్ లోనే కాదు టిడిపిలో రెడ్డి నేతలే, టిఆర్ఎస్ లో రెడ్డి నేతలే, బిజెపిలో రెడ్డి నేతలే, ఆఖరికి వామపక్షాలైన సిపిఎం, సిపిఐలలో కూడా రెడ్డి నేతలే కనబడతారు. నల్లగొండ తర్వాత స్థానం పాలమూరుకు దక్కుతంది.

బిసి నేత బూడిద భిక్షమయ్యకు పొగ

ఇక ఈసారి ఎన్నికల్లో నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బిసిలకు ఇచ్చే టికెట్లు ఎన్ని? కాంగ్రెస్ నాయకత్వంలోని మహా కూటమి బిసిలకు ఇచ్చే టికెట్లు ఎన్ని అంటే ఎవరూ చెప్పలేని పరిస్థితే ఉన్నది. ఇప్పుడున్న ప్రకారం కాంగ్రెస్ కచ్చితంగా బిసి నేతకు ఇచ్చే సీటు ఒక్కటి మాత్రమే ఆ సీటేదో కాదు ఆలేరు. ఆలేరులో గౌడ సామాజికవర్గానికి చెందిన బూడిద భిక్షమయ్య గౌడ్ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టిఆర్ఎస్ సునీతా మహేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి టిఆర్ఎస్ లో సునీతారెడ్డికే టికెట్ దక్కింది. కాంగ్రెస్ నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ కు దక్కే చాన్స్ ఉంది. 

అయితే బూడిద భిక్షమయ్య గౌడ్ కు ఆలేరులో పొగ పెడుతున్నట్లు విమర్శలున్నాయి. ఆలేరుకు చెందిన రెడ్డి సామాజికవర్గ యూత్ లీడర్ ఉదయ్ చందర్ రెడ్డి ఈసారి తాను రెబెల్ గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. బూడిద భిక్షమయ్య గౌడ్ కు డిసిసి పదవి, ఎఐసిసి పదవి, పిసిసి పదవి తన సతీమణికి ఇస్తూ మళ్లీ టికెట్ కూడా ఇస్తారా అని ఉదయ్ రెడ్డి విమర్శ. అయితే ఉదయ్ చంద్ రెడ్డి వెనుక ఎవరైనా పెద్ద రెడ్డి ఉన్నారా అన్న చర్చ సాగుతున్నది. నిజానికి ఉదయ్ చంద్ రెడ్డి అంత బలమైన లీడరేమీ కాదు. ఆయన కుటుంబం గత సర్పంచ్ ఎన్నికల్లో మోటకొండూరులో పోటీ చేసి ఓటమిపాలైన పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద రెడ్డి లీడర్ అండడండలతోనే  ఉదయ్ చంద్ రెడ్డి బరిలోకి దిగే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. 

సిపిఐ నేతకూ తప్పని కూటమి అగ్రవర్ణ ముప్పు ?

ఇక కూటమి ముప్పు మరో బిసి నేతకు సైతం తప్పేలా లేదు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం బిసి చైతన్యానికి పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే టిఆర్ఎస్ తరుపున సిట్టింగ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించారు. కానీ ఆయన తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. ఇక కూటమి నుంచి పోటీ చేసేదెవరో అన్నది తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ గతంలో అనేకసార్లు సిపిఐ గెలుస్తూ వచ్చింది. నియోజకవర్గంలో ఇప్పటికీ సిపిఐకి బలమైన కేడర్ ఉంది. గతంలో  ఉజ్జిని నారాయణ రావు, ఉజ్జిని యాదగిరిరావు, పల్లా వెంకట్ రెడ్డి ఇక్కడ ినుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి సిపిఐ పార్టీలో బిసి నేతగా ఉన్న నెల్లికంటి సత్యం బరిలోకి దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సిపిఐ ఇక్కడ అనేకసార్లు అగ్రవర్ణాలకే పోటీ చేసే చాన్స్ ఇచ్చింది. ఈసారి యాదవ సామాజికవర్గానికి చెందిన నెల్లికంటి సత్యం కు ఇవ్వాలని కేడర్ అంతా డిమాండ్ చేస్తున్నారు.

సిపిఐ మాజీ ఎమ్మెల్యేలతో మనుగోడు నేత నెల్లికంటి సత్యం

కానీ కూటమి రాజకీయ సమీకరణాల పేరుతో చివరి నిమిషంలో నెల్లికంటి సత్యం పేరు ఎగ్గొటే చాన్స్ ఉందని సిపిఐ మునుగోడు పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విశాల ప్రయోజనాలు, కూటమి ప్రయోజనాల పేరుతో సిపిఐలో రేస్ లో ఉన్న ఏకైక బిసి నేతకు ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదని వారు అంటున్నారు. తాను ఈసారి ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసి తీరుతానని నెల్లికంటి సత్యం ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఇటీవల కాలంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టి నియోజకవర్గంలో హల్ చల్ చేశారు. 

అయితే కూటమి కడుతున్నట్లు ప్రచారం మొదలు కాగానే ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి మళ్లీ పోటీ చేస్తారన్న ప్రచారం సాగింది. కానీ తాను పోటీ చేస్తానని వస్తున్న ప్రచారాన్ని పల్లా వెంకట్ రెడ్డి ఖండించారు. కూటమిలో మునుగోడు సీటు సిపిఐకే దక్కేలా ప్రయత్నాలు చేస్తామని లోకల్ కేడర్ కు ఆయన హామీ ఇచ్చారు. అయితే సిపిఐ అంటేనే కమ్మ రెడ్డి పార్టీగా ముద్ర పడింది. సిపిఎం అంటే అచ్చ కమ్మ పార్టీగా చెలామణిలో ఉంది.

ఈ నేపథ్యంలో సిపిఐ కి ఐదు సీట్లు కూటమిలో ఖరారైనట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అందులో ఏ ఐదు ఖరారు అవుతాయన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. సిపిఐ లో కమ్మ, రెడ్డి కులాల లీడర్ల సీట్లు పదిలం చేసుకుని మిగతా వాళ్ల సీట్ల విషయంలో లైట్ తీసుకుంటారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సిపిఐ బలంగా కోరుతున్న స్థానాలు ఇవి :

1 హుస్నాబాద్ (రెడ్డి )

2 కొత్తగూడెం (కమ్మ)

3 ఖమ్మం (కమ్మ)

4  దేవరకొండ 

5 బెల్లంపల్లి 

6 వైరా 

7 పినపాక 

8 మునుగోడు లేదా ఆలేరు

పై ఎనిమిదిలో ఏదేని 5 సీట్లు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. 

సై అంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్

మరోవైపు తాను మునుగోడులో పోటీకి దిగబోతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఒక దశలో అధిష్టానం మీద తిరుగుబాటు కూడా చేయబోయి వెనక్కు తగ్గారు. కుంతియా శనిలా దాపురించిండు అంటూ తీవ్రమైన విమర్శలు చేసి షోకాజ్ నోటీసు ఇవ్వడంతో వెనుకడుగు వేశారు. అయితే తాను కచ్చితంగా కూటమి తరుపున మనుగోడులో పోటీ చేయడం ఖాయమని ఆయన అంటున్నారు. అయితే ఇప్పటికే ఆయన సిపిఐ పెద్ద లీడర్లను మచ్చిక చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. కూటమి సీట్లలో మునుగోడు తప్ప ఏ సీటైనా మీరు డిమాండ్ చేయండి అని సిపిఐ పెద్దలతో మాట్లాడుకున్నట్లు.. అవసరమైతే వారికి మిగతా సీట్లలో తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పినట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

మరి ఈ పరిస్థితుల్లో నల్లగొండ జిల్లా కూటమి రాజకీయాలు కేవలం అగ్రవర్ణాల చుట్టే తిరుగుతాయా బడుగు జీవులైన బిసిలకు కూడా సముచిత న్యాయం కూటమిలో దక్కుతుందా అన్న ఆందోళనలో బిసి సామాజికవర్గాలు బిక్కు బిక్కుమంటూ కాలమెల్లదీస్తున్నాయి.