చంద్రబాబు హయాంలో అధికారుల్ని టీడీపీ నేతలు ఏ స్థాయిలో బెదిరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఓ సాధారణ పోలీసు అధికారి అయిన గోరంట్ల మాధవ్‌పై రెచ్చిపోయారు. కానీ, ఆ గోరంట్ల మాధవ్ ఇప్పుడు హిందూపురం ఎంపీ. మరి, జేసీ దివాకర్‌రెడ్డి పరిస్థితేంటి.? ఆయన జస్ట్ మాజీ ఎంపీ మాత్రమే. రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గరపెట్టుకోకపోతే ఏమవుతుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. టీడీపీ అని కాదు, వైసీపీ అని కాదు.. ఏ రాజకీయ పార్టీ అయినా అంతే. అలాగని, అధికారులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేసి, రాజకీయాల్లోకొచ్చి.. అందరూ సక్సెస్ అయ్యారని చెప్పలేం. అధికారులు రాజకీయ నాయకులుగా మారే అవకాశం వుంటుంది.. రాజకీయ నాయకులు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులుగా మారలేరు. ఇప్పుడు, అసలు విషయానికొద్దాం. గుంటూరు అర్బన్ ఎస్పీ మీద శాసన మండలి ఛైర్మన్‌కి మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ఫిర్యాదు చేసేశారు. ఓ కేసులో టీడీపీ కార్యకర్తకు అన్యాయం జరిగిందన్నది లోకేష్ ఆవేదన. ఈ క్రమంలో లోకేష్ వర్సెస్ ఎస్పీ అమ్మిరెడ్డి మధ్య ట్వీట్‌వార్ నడిచింది.
ప్రజా ప్రతినిథిని ఓ అధికారి బెదిరించడమా.?
‘తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు..’ అని మాత్రమే అర్బన్ ఎస్పీ చెప్పారు. అందులో నిజానికి తప్పుపట్టాల్సిన వ్యవహారమేమీ లేదు. ట్వీట్ ద్వారా ఎస్పీ, అసత్య ప్రచారాన్ని ఖండించారు.. చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఇదే బాధ్యతను పోలీస్ అధికారులు అధికార పార్టీ విషయంలో కూడా వ్యవహరిస్తారా.? అన్నదే చర్చ ఇక్కడ. అదెలాగూ జరగదు. ఎందుకంటే, టీడీపీ హయాంలో కూడా జరిగింది ఇదే. ఆ మాటకొస్తే, ఏ పార్టీ అధికారంలో వున్నా.. అధికారులకి ఈ తిప్పలు తప్పవు. ప్రజా ప్రతినిథులు.. అంటే, ప్రజలు ఓట్లేస్తే గెలిచిన నాయకులు. ఐదేళ్ళకోసారి ఆయా నేతల జాతకాలు మారిపోతాయ్. అలాంటప్పుడు, ఉద్యోగులపై విరుచుకుపడటమేంటి.? అందునా, పోలీస్ అధికారులపైనా.. అదీ పోలీస్ ఉన్నతాధికారులపైన.!
లోకేష్ హంగామా ఇదే కొత్త కాదు.!
తండ్రి బాటలోనే తనయుడు.. ఔను, నారా లోకేష్.. ఈ విషయంలో తన తండ్రిని మించిపోయాడు. అధికారుల మీద అసహనం వ్యక్తం చేయడం నారా లోకేష్‌కి కొత్త కాదు. ఆ మాటకొస్తే, చంద్రబాబుని నారా లోకేష్ అచ్చంగా ఫాలో అయిపోతున్నారని అనుకోవచ్చేమో. కొత్త రాజకీయాల్లోకి వచ్చినవాళ్ళలో కొంత ఆవేశం వుండొచ్చు. కానీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు సంయమనం కోల్పోతే ఎలా.? పైగా, తన ఆవేశాన్ని.. ఇప్పుడు తన తనయుడు ఓ వారసత్వంగా భావిస్తున్న విషయాన్ని చంద్రబాబు ఎలా సమర్థించుకోగలరు.?
జగన్ తక్కువేమీ చేయలేదు
వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా వున్నప్పుడూ ఇలాంటివి జరిగాయి. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే. అధికారులకి రాజకీయ నాయకులు గౌరవం ఇవ్వరు.. అందుకే, అధికారుల్ని ప్రజలూ లెక్క చేయరు. అలా లెక్క చేయరు కాబట్టే, అధికారులు సంయమనం కోల్పోతుంటారు.. ఇదంతా మళ్ళీ వేరే చర్చ. బాధ్యతగల ప్రజా ప్రతినిథులు, రాజకీయ నాయకులు అధికారులకు తగిన గౌరవం ఇస్తే.. వ్యవస్థ బాగుపడుతుందన్నది నిర్వివాదాంశం.