AP Minister : జిల్లాలు పెరిగినట్లే, రాజధానులూ పెరుగుతాయ్.!

AP Minister : విశాఖపట్నం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయి తీరుతుందంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. కొత్త జిల్లాల ఏర్పాటులో రాజకీయ విమర్శలకు తావు లేదని అవంతి చెప్పుకొచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఎలాగైతే జరిగిందో, కొత్త రాజధానుల ఏర్పాటు కూడా అలాగే జరుగుతుందని అవంతి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

అయితే, కొత్త జిల్లాలు వేరు.. కొత్త రాజధానులు లేవు. నిజానికి, కొత్త జిల్లాల విషయమై కూడా కొంత గందరగోళం వుంది. కేంద్రం, జనగణన దృష్ట్యా దేశంలో ఏ రాష్ట్రమూ కొత్త జిల్లాల ఏర్పాటు ఇప్పట్లో చేయకూడదంటూ కొన్నాళ్ళ క్రితమే నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతో, ఏపీ తలపెట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు సక్సెస్ అవదేమోనన్న అనుమానాలున్నాయి.

కాగా, కేంద్రం జూన్ వరకు గడువు ఇచ్చిందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏది నిజం.? అన్నది ముందు ముందు తేలుతుంది. మరోపక్క, కొత్త జిల్లాల విషయమై అభ్యంతరాలు తీవ్రస్థాయిలోనే వినిపిస్తున్నాయి. దాంతో, ఇదో కొత్త తలనొప్పిగా మారింది ఏపీ సర్కారుకి.

ఇంతకీ, కొత్త రాజధానుల సంగతేంటి.? అమరావతిని రాజధానిగా గుర్తించేందుకు వైసీపీ సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలించాలనే పట్టుదలతో వుంది. కానీ, ఏపీ సర్కారు తెచ్చిన మూడు రాజధానుల చట్టం విమర్శలకు తావివ్వడం, వివాదాల్ని ఎదుర్కోవడంతో, ఆ చట్టాన్ని ప్రభుత్వమే వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

కొత్త చట్టం చెయ్యాలి.. మూడు రాజధానులపై ముందడుగు వేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా.?