తెలుగురాష్ట్రాల్లో ఇప్పటికీ ఎర్ర జెండా ఎగురుతుందంటే అది కేవలం మా క్రెడిట్ అని చెప్పుకుంటుంటారు ఎర్ర పార్టీ నేతలైన రామకృష్ణ.. నారాయణ! అయితే… అవును నేడు తెలుగురాష్ట్రాల్లో ఎర్రజెండా పరిస్థితి ఇలా ఉందన్నా కారణం మీఇద్దరే అని కమ్యునిస్టు పార్టీ అభిమానులు కౌంటర్ వేస్తుంటారు! అందుకు కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే… ఈ నేతలు పైకి ఎర్రపార్టీ నేతలైనా… పసుపు రంగు పులుముకోవడానికే ఎక్కువ ఆత్రం చూపిస్తుంటారు! అందులో భాగంగానే తాజాగా లోకేష్ తరుపున వకాల్తా పుచ్చుకుని.. జగన్ పై విమర్శలు చేశారు సీపీఐ నారాయణ!
చాలా గ్యాప్ తర్వాత మైకులముందుకొచ్చిన నారాయణ… లోకేశ్ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ దృష్టిలో లోకేశ్ అనే నాయకుడు “పప్పు” అయినప్పుడు.. అలాంటి లోకేశ్ పాదయాత్రను ఎందుకు అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడితో ఆగని ఆయన.. పప్పును చూసి కూడా భయపడుతున్నారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇంతవరకూ లోకేష్ దగ్గర మార్కులు కొట్టే ప్రయత్నం చేసిన ఆయన… నెక్స్ట్ బాబు నోట్లో మాటలు పలికే ప్రయత్నం చేశారు!
అందులో భాగంగా.. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై విమర్శలు చేశారు నారాయణ. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించి భారీగా పెట్టుబడులు వచ్చాయనడంలో వాస్తవం లేదని మొదలుపెట్టిన నారాయణ.. సీఎం జగన్ ను పారిశ్రామికవేత్తలు విశ్వసించే పరిస్థితి ఎంత మాత్రం లేదని చెప్పుకొచ్చారు. పరిశ్రమల కోసం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు కాకి లెక్కలేనని చెబుతున్న ఆయన… విశాఖ పెట్టు బడుల సదస్సు అంతా నాటకమేనని ఆరోపించారు. అలా రెగ్యులర్ పొలిటికల్ పార్టీలు చేసేలాంటి విమర్శలు విన్నవారు మాత్రం.. అసలు సిసలు కమ్యునిస్టులకు – పసుపు రంగు మిక్సయిన ఎర్రన్నలకు ఎంత తేడా అనే కామెంట్లు చేస్తున్నారు!