LIC: ఒక్క రోజులో లక్షల బీమా పాలసీలు.. గిన్నిస్‌లో ఎల్ఐసీ అరుదైన రికార్డు!

భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బీమా పాలసీలు విక్రయించిన సంస్థగా గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది. ఈ విశేషం ఈ ఏడాది జనవరి 20న జరగగా, తాజాగా దీనిపై ఎల్ఐసీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

జనవరి 20న నిర్వహించిన ‘మ్యాడ్ మిలియన్ డే’ ప్రత్యేక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 4,52,839 మంది ఎల్ఐసీ ఏజెంట్లు కలసి 5,88,107 జీవిత బీమా పాలసీలను జారీ చేశారు. జీవిత బీమా రంగ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో పాలసీలు కేవలం ఒక్క రోజులో జారీ కావడం ఇదే తొలిసారి. ఈ అపూర్వ విజయాన్ని గిన్నిస్ సంస్థ కూడా అధికారికంగా గుర్తించి ఎల్ఐసీకి సర్టిఫికెట్ జారీ చేసింది.

ఈ ఘనత వెనుక సంస్థ ఏజెంట్ల అంకితభావం, శ్రమ దాగి ఉందని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ మొహంతి తెలిపారు. వినియోగదారుల ఆర్థిక భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, దేశవ్యాప్తంగా ఉన్న తమ నెట్‌వర్క్‌ను మరింత బలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. ప్రతి ఏజెంట్ కనీసం ఒక్క పాలసీ పూర్తి చేయాలన్న పిలుపు ఇచ్చిన ఫలితం ఇది అని వివరించారు.

ఇక బీమా రంగంలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ ఘనత ద్వారా ఎల్ఐసీ మరోసారి తన మైలురాయి విజయాన్ని నమోదు చేసింది. దేశవ్యాప్తంగా కోట్ల మందికి భద్రతను అందించడంలో తమ బాధ్యతను నెరవేర్చడంలో ఇది పెద్ద అడుగుగా నిలుస్తుందని సంస్థ అభిప్రాయపడుతోంది.