ఫ్రిజ్ లో కట్ చేసిన నిమ్మకాయ పెడితే ఏమవుతుందో తెలుసా.. నిపుణుల సలహా ఇదే..!

ఫ్రిజ్ అంటేనే చల్లని ఉంటుంది. కానీ అందులోని గాలి మాత్రం ఎప్పుడూ శుభ్రంగా ఉంటుందా.. రోజూ ఉల్లిపాయలు, వెల్లుల్లి, మిగిలిపోయిన కూరలు, పాలు, పెరుగు.. ఇలా రకరకాల పదార్థాలు పెట్టడంతో ఫ్రిజ్ లోపల గాలి కలుషితం కావడం సహజం. ఆ గాలే దుర్వాసనకు, బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. ఇలాంటి సమస్యలకు మన ఇంట్లోనే ఉన్న ఒక చిన్న పరిష్కారం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే నిమ్మకాయ. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఫ్రిజ్ లోపల ఒక సహజ ఎయిర్ ప్యూరిఫైయర్‌లా పనిచేస్తుంది. గాలిలో ఉండే సూక్ష్మజీవులను అరికట్టి, ఫ్రిజ్ అంతా ఫ్రెష్‌గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా క్లోజ్డ్ స్పేస్ అయిన ఫ్రిజ్‌లో ఈ గుణం ఎంతో ఉపయోగపడుతుంది.

చాలా మందికి ఎదురయ్యే పెద్ద సమస్య ఫ్రిజ్ దుర్వాసన. ఉల్లిపాయలు లేదా మిగిలిపోయిన కూరలు పెట్టిన తర్వాత వచ్చే వింత వాసన ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. దీనికి సగం నిమ్మకాయను తీసుకుని, దానిపై కొద్దిగా వంట సోడా లేదా ఉప్పు చల్లి ఫ్రిజ్‌లో ఒక మూలన పెట్టితే సరిపోతుంది. కొన్ని గంటల్లోనే దుర్వాసన తగ్గి, ఫ్రిజ్ మొత్తం ఒక రిఫ్రెషింగ్ సువాసనతో నిండిపోతుంది.

ఇదే కాదు.. నిమ్మకాయలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా చేరకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా పాలు, పెరుగు వంటి పదార్థాలు త్వరగా పులిసిపోకుండా ఉండేందుకు ఇది సహాయపడుతుంది. ఫ్రిజ్‌లో ఉండే గాలిలో సిట్రిక్ యాసిడ్ ప్రభావం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ ట్రేలపై పడే కూరగాయల మరకలు తొలగించడానికి కూడా నిమ్మకాయ ఉపయోగపడుతుంది. నిమ్మరసం కలిపిన నీటితో ట్రేలను తుడిచితే మొండి మరకలు సులభంగా పోతాయి. అంతేకాదు, ప్లాస్టిక్ ట్రేలు కొత్తవాటిలా మెరుస్తాయి కూడా.

అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టిన నిమ్మకాయ ముక్కలను ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి తప్పనిసరిగా మార్చాలి. ఎండిపోయిన నిమ్మకాయ ముక్కల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎప్పుడూ తాజాగా కోసిన నిమ్మకాయనే ఉపయోగిస్తేనే మంచి ఫలితం కనిపిస్తుంది. చిన్న నిమ్మకాయ.. కానీ ఫ్రిజ్‌కు పెద్ద రక్షణ. ఖర్చు లేకుండా, కెమికల్స్ అవసరం లేకుండా ఫ్రిజ్‌ను శుభ్రంగా ఉంచాలంటే ఈ సింపుల్ ట్రిక్ తప్పక ట్రై చేయాల్సిందే.