భారత రాజకీయాల్లో మళ్లీ నరేంద్ర మోదీ హవా కొనసాగుతోందని తాజా సర్వేలో తేలింది. ‘మూడ్ ఆఫ్ ద్ నేషన్’ సర్వే ప్రకారం, ఇప్పుడే లోక్‌సభ ఎన్నికలు జరిగినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఎన్డీయే 343 సీట్లు గెలుచుకునే అవకాశముందని, అందులో బీజేపీ ఒక్కటే 281 స్థానాలు దక్కించుకుంటుందని వివరించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 78 సీట్లకే పరిమితమవుతుందని స్పష్టం చేసింది.
ఈ సర్వే జనవరి 2 నుంచి ఫిబ్రవరి 9 వరకు దేశవ్యాప్తంగా 1,25,123 మందిని ప్రశ్నించి రూపొందించబడింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఇచ్చిన ‘400 కే పార్’ నినాదం కార్యరూపం దాల్చకపోయినప్పటికీ, ఆరునెలల్లో బీజేపీ మళ్లీ పుంజుకున్నట్లు ఈ సర్వే చూపిస్తోంది. 292 సీట్లు సాధించిన ఎన్డీయే కూటమి, ఇప్పుడు ప్రజల్లో తిరిగి విశ్వాసాన్ని సంపాదించిందని, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన విజయాలు బీజేపీ క్యాడర్‌కు కొత్త ఉత్సాహం ఇచ్చాయని పేర్కొంది.
ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయే 343 సీట్లు గెలిచే స్థితిలో ఉందని సర్వే స్పష్టం చేసింది. ఇండియా కూటమి పరిస్థితి క్షీణించినట్లు సర్వేలో వెల్లడైంది. 2024లో 232 సీట్లు గెలుచుకున్న ఈ కూటమి ఇప్పుడు 188 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మరింత దిగజారిందని, దేశవ్యాప్తంగా వారి ఓట్ షేర్ ఏకంగా 20 శాతం తగ్గినట్లు పేర్కొంది. ఇది ప్రధాన విపక్షమైన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఈ సర్వే బీజేపీకి ఊహించని ఉత్సాహం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. 2024లో ఆశించిన ఫలితం రాకపోయినా, మోదీపై ప్రజల్లో ఆదరణ తగ్గలేదని సర్వే స్పష్టమైంది. ఎన్డీయే పునరుత్థానం బీజేపీ వ్యూహపరమైన రాజకీయాలు, క్యాడర్ కృషి ఫలితమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ నాయకత్వంలో మరోసారి బీజేపీ తన దారిని గట్టిగా రుజువు చేసుకునే దిశగా ఉందని ఈ సర్వే సంకేతాలు ఇస్తోంది.