పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్న కేటీయార్.! బీఆర్ఎస్ వ్యూహమేంటి.?

భారత్ రాష్ట్ర సమితి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యకలాపాల్ని పెంచనుంది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా జనసేన మాజీ నేత తోట చంద్రశేఖర్‌ని ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీయార్ నియమించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్‌లో ఇప్పటికే చేరిన ఏపీ నేతలకు గతంలో జనసేన పార్టీతో సన్నిహిత సంబంధాలుండేవి.

కేవలం జనసేనను దెబ్బ తీయడానికే, ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలంటూ జనసేన నేతలు కొందరు ఆరోపిస్తున్నారు కూడా. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ భేటీ కానున్నారన్న ప్రచారానికి ప్రాధాన్యత చేకూరుతోంది.

అసలు ఇది ఉత్త ప్రచారమేనా.? నిజంగా పవన్ కళ్యాణ్ – కేటీయార్ భేటీ అవుతారా.? ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రూపంలో భారత్ రాష్ట్ర సమితికి ఓ సానుకూల పొలిటికల్ వైబ్ వుంది. బీఆర్ఎస్ మీద వైసీపీ నేతలు సెటైర్లేస్తున్నాసరే, హైద్రాబాద్‌లో తమ ఆస్తులు, ఇతరత్రా వ్యాపకాల నేపథ్యంలో వైసీపీ నేతలంతా, కేసీయార్ అండ్ టీమ్‌తో సఖ్యంగానే వుంటారు.

పైగా, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపుకి గులాబీ పార్టీ కూడా తెరవెనుకాల సహాయ సహకారాలు అందించిందాయె. ఈ నేపథ్యంలో కేటీయార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కాకుండా తొలుత పవన్ కళ్యాణ్‌తో ఎందుకు భేటీ అవుతారు.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది.