ప్రతి ఏడాది శ్రావణ మాసం కృష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు. ఈ పర్వదినం చిన్న కృష్ణుడి లీలలు, చిరునవ్వుతో నిండిన చిలిపి చేష్టలు, అలాగే అందులో దాగి ఉన్న గొప్ప తత్వం గుర్తు చేసుకునే రోజు. గోపాలుడి మురళి నాదం, వెన్న దొంగతనం, గోపికలతోని చిలిపి ఆటలు.. ఈ అందమైన లీలల వెనుక భక్తిని మించిన తత్వం దాగి ఉందని పండితులు చెబుతుంటారు.
కృష్ణుని జన్మకథలోనే ఒక గొప్ప పాఠం ఉంది. దేవకీ గర్భాన జన్మించిన కృష్ణుడు, పుట్టగానే తల్లికి దూరమయ్యాడు. శిశువుగా జైలులో పుట్టి, రాత్రి వర్షంలో గంగానదిని దాటి గోకులానికి చేరాడు. ఇదే మన జీవితంలో మొదటి పాఠం.. పుట్టుకతోనే కష్టాలు వచ్చినా, వాటిని భయపడకుండా స్వీకరించాలి. మహత్తర లక్ష్యం ఉంటే, ప్రతి అడ్డంకి ఒక మెట్టుగా మారుతుంది.
ఇక బాల్యంలోనే కృష్ణుడు ఎన్నో ఘనకార్యాలు చేశాడు. పాలిచ్చే సాకుతో హతమార్చాలని వచ్చిన పుతన అనే రాక్షసిని సంహరించాడు. తల్లి రోలుకు కట్టేసినా, తన చిన్న చేతులతో రెండు యమలార్జున చెట్లను పడగొట్టి గంధర్వులకు విముక్తి ఇచ్చాడు. కబంధుడు అనే రాక్షసుని వధించాడు. ఈ లీలలు కేవలం వీరత్వం కాదు.. ధర్మం ముందు వయసు అడ్డంకి కాదు అన్న బోధ.
ఇక కృష్ణుడికి వెన్నంటే ప్రాణం. ఇరుగు పొరుగు ఇళ్లలో దొంగతనంగా వెన్న తినేసి, పట్టుబడితే అమాయకంగా నటించేవాడు. కానీ అది కేవలం అల్లరి కాదు.. మనసులోని లోభం, పాపం వంటి చెడులను దొంగిలించి మనసును పవిత్రం చేయడం అనే ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఇక యమునా తీరం వద్ద గోపికల వస్త్రాలను అపహరించడం కూడా అల్లరి కాదు. గోపికలు కాత్యాయనీ వ్రతం చేస్తూ వివస్త్రంగా స్నానం చేయడం అనే తప్పును సరిచేసిన తత్వం. ఇలా ఆచారం వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాన్ని గుర్తు చేశాడు. శరీరమే కాదు, ఆత్మను కూడా పవిత్రంగా ఉంచాలి అనే సత్యాన్ని ఈ లీలా చెబుతుంది.
కృష్ణుడు యుద్ధంలో కూడా తత్వవేత్త. కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన గీతా బోధ ఈ యుగంలోనూ మనకు మార్గదర్శకమే. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతలో చెప్పిన వాక్యం కేవలం భగవాన్ మాటే కాదు.. ప్రతి యుగంలోనూ, ప్రతి మనిషిలోనూ న్యాయం కోసం పోరాడే శక్తి ఉంది అనే గుర్తు.
భాగవతంలోని దశమ స్కంధం మొత్తం చదివితే కృష్ణతత్వం మరింత లోతుగా అర్థమవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలిగించగలదన్న విశ్వాసం కూడా ఉంది. అందుకే జన్మాష్టమి కేవలం పండుగ కాదు.. జీవనానికి మార్గదర్శకం. ఈ శ్రావణంలో ఆ లీలల్లోని పాఠాలను మన హృదయాల్లో నిలిపి, జీవితం వెన్నంత మాధుర్యంగా, మురళి నాదంలా శాంతంగా సాగించుకుందాం. జై శ్రీకృష్ణ.
