ఖలిస్తాన్ తీవ్రవాదులే ఎర్రకోట రగడకు కారణమా.? దేశ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ఎర్రకోటపై ఓ మతానికి చెందిన జెండా ఎగురవేయడం ద్వారా ఖలిస్తాన్ టెర్రరిస్టులు తమ పైత్యాన్ని ప్రదర్శించారా.? ఇప్పుడు ఈ ప్రశ్నల చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కార్ ఇటీవల తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల్ని నిరసిస్తూ రైతులు సుదీర్ఘమైన ఆందోళన షురూ చేసిన విషయం విదితమే. కేంద్రం పలు దఫాలుగా ఇప్పటికే రైతులతో చర్చించింది. ఏడాదిన్నరపాటు అవసరమైతే చట్టాల అమలు నిలిపివేస్తామనీ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, రైతులు మాత్రం ఆ చట్టాలను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని రోజులుగా శాంతియుతంగా జరుగుతున్న ఆందోళన అనూహ్యంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
‘నిజమైన రైతులంతా తిరిగి ఢిల్లీ శివార్లలోని ఆందోళన కోసం ఏర్పాటు చేయబడిన శిబిరాలకు చేరుకోవాలి’ అని రైతు సంఘాల నేతలు పిలుపునిస్తున్నారు. నిజానికి, రైతు శాంతి కాముకుడు. రైతు అనేవాడెవడూ విధ్వంసాలను కోరుకోడు. రైతు ఆందోళన చేస్తున్నది తన పొట్ట నింపుకోవడానికి, పది మంది పొట్ట నింపడానికి. ఖచ్చితంగా ఢిల్లీ ఉద్రిక్తతల వెనుక ఖలిస్తాన్ వేర్పాటువాదుల కుట్ర వుండే వుండాలి. ఆందోళనకారుల్లో సున్నిత మనస్కుల్ని, విపరీత స్వభావం వున్నవారిని ఖచ్చితంగా ఎవరో తప్పదోవ పట్టించే వాుండాలి. వాళ్ళ కారణంగానే ఎర్రకోటపై రైతు జెండాతోపాటుగా, ఓ మతానికి చెందిన జెండాని ఎగురవేసి వుండాలి. ‘అబ్బే, అది ఓ మతానికి చెందిన జెండా కాదు..’ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సినీ నటుడు సిద్దు చెబుతున్నప్పటికీ, ఈ మొత్తం వ్యవహారంపై లోతైన విచారణ చేపట్టాలని, నిజాల్ని నిగ్గు తేల్చాలని ఢిల్లీ పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయనీ, రైతులెవరూ ఆ ట్రాప్‌లో పడకూడదని రైతు సంఘాలు పిలుపునిస్తున్న దరిమిలా.. ఉద్యమం మళ్ళీ శాంతియుతమార్గం వైపు మళ్ళుతుందనే భావించాలేమో. ‘మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. విధ్వంసాలని అస్సలు ప్రోత్సహించబోం. మేం, కేవలం కొత్త వ్యవసాయ చట్టాల రద్దుని కోరుతున్నాం..’ అని రైతు సంఘాల నేతలు కుండబద్దలుగొట్టేశారు. ‘కావాలనే, ట్రాక్టర్ల ర్యాలీని తప్పుదారిలోకి మళ్ళించారు..’ అన్నది రైతు సంఘాల వాదనగా కనిపిస్తోంది.