యా దేవి సర్వభూతేషు…

(గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి)
 
శబరిమల ఆలయంలో ప్రవేశించేందుకు హిందూ మహిళలకు అనుమతి  దొరికాక, ఇతర మతాల మహిళలు వూరుకుంటారా? ఇపుడు కేరళ ముస్లిమ్ మహిళలు మసీదులలోకి తమనీ అనుమంతించాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
 

“సిగ్గూశరం లేదుటే పాడుముండా,నీకు మసీదే దొరికిందా?ఏ బజారులో కూర్చుని దుకాణం పెట్టకపోయావు?”…మసీదు వెలుపల ముగ్గురు పిల్లలతో కూర్చున్న గర్భవతి హసీనా ను ఒక సనాతనురాలు అన్నమాటలవి.ఇంతకూ హసీనా ఎవరు?

ఊరివెలుపల ఒక పాక,ఉదయాన్నే ఫజర్(తొలిప్రార్ధన)సమయంలో పాకనుంచి 8ఏళ్ల పిల్ల,నాలుగేళ్ల పిల్ల,చంకలో ఒకపిల్ల..కడుపులో మరో పిల్లను తీసుకుని మసీదులో ముతావలిని కలిసేందుకు బయలుదేరి మసీదు వెలుపల కూర్చుంది హసీన.

ఆమె అక్కడ కూర్చోవడానికి కారణాలు మెల్లిగా తెలుస్తాయి…ఆమె భర్త ఒక ఆటో డ్రైవర్.అందరూ కలసి ఉర్సుకు వెళ్లారు.భార్య ఇష్టపడిందని 15 రూపాయలు పెట్టి పావుకిలో జలేబీ కొన్నాడు.పుట్టబోయే కొడుకు కోసం ఒక జలతారు టోపీ కొన్నాడు..ఇక ఆ మరుసటి దినం రహస్యంగా ఒక స్కానింగ్ సెంటర్ కు పోతే తెలిసింది కడుపులో ఉన్నది ఆడపిల్లేనని.

 
 

ఇంకేముంది?ఏ పిల్లకావాలో పుట్టించే బాధ్యత(???) లేని భార్యమీద జులుం చూపించడం,కొట్టడం మొదలు పెట్టాడు.ఇంటికి రావడం మానేసాడు.వెదకడానికి పోయిన కూతురికి పిల్ల ఐస్ కొనిచ్చి అబద్దం చెప్పమన్నాడు..తీసుకురావటానికి స్వయంగా ఆటో స్టాండ్ కు వెళ్లిన హసీనా మీద చెయ్యి చేసుకున్నాడు..రోజూ గొడావలే..ఈ సారి ఇంటికి తాళం వేసి పోయాడు..వెదకడానికి పోయిన పెద్దకూతురు(ఈ అమ్మాయి అంధురాలు అయినా అంధుల పాటశాలలో చదువుతూ ఉంటుంది)ఒక గోతిలో పడిపోతుంది..డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే ఆ అమ్మాయికి కట్టుకట్టి కళ్లూ పరీక్షించి ఒక కన్ను పాక్షిక దృష్టి లోపం ఉంది,ఆపరేషన్ చేయిస్తే చూపు వస్తుందంటాడు డక్టర్..ఖర్చు 15,000 అవుతుందంటాడు..

భర్త వదిలేసి తినటానికే కష్టంగా ఉంటే మళ్లీ ఈ ఖర్చు..తల్లి,అంధురాలైన పెద్దకూతురు,నాలుగేళ్ల మధ్యకూతురు రెక్కలు ముక్కలు చేసుకుని అగర్‌బత్తీలు తయారు చేస్తుంటారు,హసీన ఒకరింట్లో పనిమనిషిగా చేరుతుంది…ఆవిడకూ భర్త తలాక్ ఇచ్చిపోయాడు..ఆవిడ సలహాతో ముస్లిం ధర్మానుసారం మహిళలకు ఉన్న హక్కుల గురించి చెబుతూ ముతావలి కి భర్త గురించి ఫిర్యాదులెన్నో చేస్తుంది,అన్నీ బుట్టదాకలే..ముతావలి ఇంట్లో మరో సమస్య..ఉయ్యాలలో పిల్ల,కడుపులో పిల్ల..ఆరోగ్యం పాడైన ముతావలి భార్య సణుక్కుంటూ కాపురం చేస్తుంటుంది..

ఇక భర్త తలాక్ అయినా ఇస్తే వచ్చే డబ్బుతో కూతురికి ఆపరేషన్ చేయించవచ్చు అనుకుంటుంది..మనోడు మరో పెళ్లికి సిద్దం అయ్యాడు..ఆ కాబోయే భార్యను కలసి కనీసం బిడ్డ ఆపరేషన్ కోసం డబ్బు అవసరం కాబట్టి కాబోయే భర్తను తలాక్ ఇచ్చి మళ్లీ పెళ్లి చేసుకొమ్మని అడగమని అర్ధిస్తుంది హసీన..తాను కూడబెట్టిన 5 వేలు ఆ అమ్మాయికి చూపించి మాట తీసుకుని బయలుదేరుతుంది..

ఇంకేముంది..భర్త కంట పడుతుంది..తన మీద చెడుగా చెప్పి 5 వేలు కాబోయే భార్య దగ్గర తీసుకుందని తలచి చావగొట్టి ఆ డబ్బు లాక్కుపోతాడు…

 

ఇన్ని సంఘటనల తర్వాత హసీన ఫజర్ సమయానికి మసీదు చేరింది..ఒక్కో ప్రార్ధనా సమయం లో ఆమె వ్యధలు చూపుతారు..ఇక రాత్రి జరిగే చివరి ప్రార్ధన సమయానికి భర్త తాగి వచ్చి మసీదు దగ్గరే చావగొడతాడు హసీనాను..అడ్డొచ్చిన పెద్దకూతురు దెబ్బలకు చనిపోతుంది…

ఈ క్రమంలో హసీన యజమానురాలు స్త్రీ హక్కుల గురించి ధర్మశాస్తాల్లో ఉన్న విషయాలు రాసిన పేపర్లు చెల్లాచెదురవుతాయి..కాపాడటానికి వచ్చిన మహిళలు అవి చదువుతారు..

ముతావలి భార్య భర్తను ఎదిరించి పుట్టింటికి పోతుంది,కుటుంబ నియత్రణ ఆపరేషన్ కోసం…హసీనా ఓడిపోయినా ఇతరులను గెలిపిస్తుంది….

 

అప్పుడెప్పుడో కన్నడ దర్శకుడు గిరీష్ కాసరవళ్లి దర్శకత్వం వహించిన హసీనా (2004) చిత్రం ఇది…

 
 

మహమ్మద్ ప్రవక్త తన కూతురు ఫాతిమా కు ఎంతో ప్రాధాన్యతనిచ్చాడు,ఎన్నో స్త్రీల హక్కుల గురించి చెప్పాడని హసీనాతో ఇంటి యజమానురాలు చెబుతుంది…

ఇక బాలయేసును ఎత్తుకున్న మేరీ మాత ఆరాధననూ చూస్తాము…

.. పోతులూరి బ్రహ్మంగారు తన పీఠాధిపతి బాధ్యతలను కూతురికే అప్పగించాడు…

—-ఇక వేదకాలం నాటి మైత్రేయి,గార్గి లాంటివారు కనిపిస్తారు.

“యా దేవి సర్వభూతేషు” అంటూ జరుపుకునే నవరాత్రులు ఇవి…తొమ్మిదిరోజుల సుధీర్గకాలం స్త్రీని శక్తిగా పూజించే పండుగ సమయం ఇది…

ఆలయాల్లో ప్రవేశమే కాదు.మసీదుల్లోకీ స్త్రీలను అనుమతించాలని ఉద్యమించబోతున్నారు కేరళ మహిళలు అనే వార్తలు వస్తున్నాయి..

ప్రార్ధనా స్థలాల్లోకి అనుమతులే కాదు,అన్ని మతాల పీఠాధిపతులుగా స్త్రీలూ నియమింపబడాలని కోరుకుందాం.