కేసీయార్ కొత్త పంపకం ‘ఫిఫ్టీ పిఫ్టీ’: ఫలిస్తుందా ఈ సూత్రం.?

KCR Formula 50 - 50: New Hiccups In Water Fights
KCR Formula 50 - 50: New Hiccups In Water Fights
ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సందర్భంగా, అప్పటి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని చెరి సగం రెండు తెలుగు రాష్ట్రాలకు పంచితే ఎలా వుండేది.? అప్పుడు కుదరని ఫార్ములా.. ఇప్పుడు నీటి పంపకాల విషయంలో అమలు చేయాలనుంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
 
ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, తన రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడంలో వింతేముంది.? కానీ, నైతికత.. అన్న చర్చ వచ్చినప్పుడు.. మనమంతా భారతీయులం. అందునా.. రెండు రాష్ట్రాల్లో వున్నది తెలుగు ప్రజలదే. సాటి తెలుగువారి పట్ల ఇంత కర్కశంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎలా ఆలోచించగలుగుతున్నారు.? కృష్ణా నది నుంచి నీటిని 50-50 పద్థతిలో.. అంటే, చెరిసగం తెలుగు రాష్ట్రాలు పంచుకోవాలన్నది కేసీయార్ మార్కు ప్రతిపాదన.
 
పోతిరెడ్డిపాడుని అంగీకరించం.. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా అక్రమమే.. కానీ, శ్రీశైలం ఎగువన తెలంగాణ ప్రభుత్వం తలపెట్టనున్న జోగులాంబ ఆనకట్ట మాత్రం సక్రమం. ఇదెక్కడి లాజిక్.? అయినా, ఇక్కడ కేసీయార్ మీద విమర్శలు చేసి ప్రయోజనం లేదు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో, సీమాంధ్ర ప్రజా ప్రతినిథులెవరూ తమకేం కావాలో గట్టిగా కోరలేకపోయారు. అదే అసలు సమస్య. అప్నటికీ, ఇప్పటికీ అదే తీరు. కేంద్రాన్ని ప్రత్యేక హోదా అడుగుతూనే వుంటామంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
 
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే, ఓ సారి ప్రత్యేక హోదా దండగంటారు.. ఆ తర్వాత అదే ప్రత్యేక హోదా అవసరం అంటారు. కేంద్ర ప్రభుత్వంలో భాగం అయివుండీ, చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. ఇప్పటికీ అది సాధించేందుకు జగన్ సర్కార్ కూడా చిత్తశుద్ధి చూపడంలేదు. నీళ్ళ విషయంలోనూ రేప్పొద్దున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన నాయకత్వమే లేదు.. రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధీ లేదు.