అధికారం ఉందని కొంతమంది నాయకులకు కన్నూ మిన్నూ కానదు. రాబోయే ఎన్నికల్లో గెలుస్తారో ఓడిపోతారో తెలియని నాయకులు.. పదవులు శాస్వతం – అధికారం స్థిరం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది… మళ్లీ అధికారంలోకి రామేమో అనే భయంతో మరింత ఫ్రస్ట్రేషన్ తో ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం ఈ అన్ని లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్నట్లు ప్రవరిస్తున్నారనే విమర్శను ఎదుర్కొంటున్న మోడీ… అనర్హత వేటు వేసి రాహుల్ అర్హతకు ప్రాణం పోసారని అంటున్నారు విశ్లేషకులు!
అవును… ఇన్నాళ్లూ ప్రతిపక్షాలకు నాయకత్వం ఎవరు వహిస్తారనే విషయంలో జాతీయ స్థాయిలో చాలా సందిగ్ధతలు ఉండేవి. కాంగ్రెస్ ని కలుపుకొని పోవడానికి చాలామంది కాస్త వెనకా ముందూ ఆలోచించేవారు. కానీ తాజాగా రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో అన్ని పార్టీలు ఏకమైపోయాయి. ముక్త కంఠంతో ఆ చర్యను ఖండించాయి. బీజేపీ నిరంకుశత్వంపై మండిపడ్డాయి. అంతమాత్రాన కాంగ్రెస్ నేతృత్వంలో అందరూ కలసి పోటీచేస్తారని చెప్పలేం కానీ.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న విపక్షాల మధ్య రాహుల్ వ్యవహారం ఐక్యతకు బీజం వేసిందనే చెప్పాలి. ఇదే క్రమంలో… కాంగ్రెస్ తరుపున రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని ఒప్పుకోవడంలో కాస్త సంసయించేవారు కూడా… తాజాగా రాహుల్ అర్హత గురించి చరించుకునే పరిస్థితి కల్పించింది బీజేపీ అనడంలో సందేహం లేదు!
ఇదే క్రమలో… తెలంగాణలో కాంగ్రెస్ తో పచ్చగడ్డివేస్తే భగ్గుమనేలాఉండే బీఆరెస్స్ నేతలు సైతం… రాహుల్ అనర్హత వేటుపై బీజేపీని ఏకిపారేస్తున్నారు. ఇది ప్రధాని మోడీ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని తీవ్రస్థాయి విమర్శలతో మొదలుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆరెస్స్ అధినేత కేసీఆర్… రాహుల్ పై అనర్హత వేటు వేసిన రోజును.. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు గా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలను వేధించడం మోడీకి పరిపాటిగా మారిందని విమర్శించారు.
ఇక రాహుల్ పై అనర్హత వేటు విషయంపై ట్విట్టర్ లో స్పందించారు కేటీఆర్. రాహుల్ పై అనర్హత వేటు వేయడం రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడమేనని అభిప్రాయపడిన ఆయన… అత్యంత అప్రజాస్వామిక పద్దతిలో వేటు వేశారని అన్నారు. దీన్ని తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించిన కేటీఆర్… ఈ సందర్భంగా ఫ్రెంచ్ తత్తవేత్త వాల్ టేర్, జర్మన్ థియాలజిస్ట్ మార్టిన్ నిమాలర్ కోట్స్ ను జతచేయడం గమనార్హం. ఇలా అన్ని బీజేపీయేతర పార్టీల నుంచీ మోడీకి వ్యతిరేకంగా – రాహుల్ కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు! దీంతో… ఈ పరిణామాలు కచ్చితంగా రాహుల్ అర్హతకు ప్రాణం పోసినట్లేనని అంటున్నారు విశ్లేషకులు!