కర్నాటక ఎన్నికలు.! తెలుగు రాజకీయాల్లో ప్రకంపనలు.!

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. కర్నాటక అంటే, తెలుగు రాష్ట్రాలు రెండిటికీ పొరుగు రాష్ట్రమే. ఆ కర్నాటకకి తమిళనాడు కూడా పొరుగు రాష్ట్రం అయినా, తెలుగు రాష్ట్రాలతో కర్నాటకకు వున్న సంబంధం ప్రత్యేకం.! నిజానికి, కర్నాటక రాజకీయాల్ని ప్రభావితం చేయగలిగే స్థాయిలో అక్కడి తెలుగు ఓటర్లు వున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అయితే తెలుగువారిదే పై చేయి కూడా.! అందుకే, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలనగానే, తెలుగు రాజకీయాల్లోనూ ప్రకంపనలు షురూ అయ్యాయి.

మరీ ముఖ్యంగా తెలంగాణలో అయితే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పట్ల ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. అందుక్కారణం, భారత్ రాష్ట్ర సమితి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వుండడమే. కర్నాటకలో బీఆర్ఎస్ మిత్రపక్షం మజ్లిస్ పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలదు.. కొన్ని సీట్లలో గెలిచే అవకాశం కూడా వుంది.

అంతేనా.? కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో కేసీయార్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. బీఆర్ఎస్ విషయంలో కుమారస్వామి సానుకూలంగా వున్నారు. ఆ లెక్కన కుమార స్వామి, బీఆర్ఎస్ సాయం తీసుకోవడమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి సైతం కొన్ని సీట్లలో మద్దతిచ్చే అవకాశాల్లేకపోలేదు.

వైసీపీ, టీడీపీల విషయానికొస్తే, ఈ రెండు పార్టీల సానుభూతిపరులు కర్నాటకలో చాలామందే వున్నారు.. అదీ ఓటర్లుగా. మరో ఆసక్తికర అంశం, జనసేన పార్టీ మద్దతుదారులు కూడా కర్నాటకలో గట్టిగానే వున్నారు. ఈ కారణంగానే కర్నాటక ఎన్నికలు తెలుగునాట ప్రకంపనలు సృష్టిస్తున్నాయ్.!