కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది. నిజానికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంతవరకు ఇది చాలా పెద్ద విజయం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభం అలాంటిది మరి.!
దేశంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుందనుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో, దక్షిణాదిన కర్నాటక రాష్ట్రంలో బంపర్ మెజార్టీతో అధికారం దక్కడం చిన్న విషయం కాదు. కానీ, అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు తయారైంది పరిస్థితి.
ఎవరు ముఖ్యమంత్రి అవుతారు.? అన్నదానిపై గందరగోళం నడుస్తోంది. డీకే శివకుమార్, సిద్ధరామయ్య.. ఇద్దరూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. ఒకరికి ఇస్తే, ఇంకొకరికి షాక్ తప్పదు. ఈ నేపథ్యంలో ఎవరికి వారు తమ తమ ఏర్పాట్లలో వున్నారు.. కాంగ్రెస్ అధిష్టానానికి షాక్ ఇచ్చేందుకు.
రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే.. ఇలా కాంగ్రెస్ ముఖ్య నేతలంతా, కర్నాటక ముఖ్యమంత్రి ఎవరు.? అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ‘ఇదిగో, ఈ ఛండాలం వుంటుందనే కాంగ్రెస్ పార్టీని వద్దనుకున్నాం..’ అంటూ కర్నాటకలో ఓ వర్గం ఓటర్లు మండి పడే పరిస్థితి వస్తోంది.
కాంగ్రెస్‌లోనూ కొందరు నేతలు, అధినాయకత్వం తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి తేల్చేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఆ తర్వాత పదవుల పంపకంలో సమన్యాయం చేసుకోవచ్చు కదా.? అదే చేస్తే, అది కాంగ్రెస్ పార్టీ ఎందుకవుతుంది.?