ఆంధ్రప్రదేశ్‌లో మొన్నామధ్య వరదలకి ఓ ప్రాజెక్టు కొట్టుకుపోయింది.. అదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. ఆ ప్రాజెక్టు కొట్టుకుపోవడం వల్ల బాధితులుగా మారిన ప్రజలు ఇప్పటికీ నెత్తీనోరూ బాదుకుంటూనే వున్నారు. వారికి సాయం అందలేదు. అన్నట్టు, పులిచింతల డ్యామ్ తాలూకు గేట్ ఒకటి ఆ మధ్య కొట్టకుపోయింది.
ప్రాజెక్టుల నిర్వహణ ఎంత చెత్తగా వుందో చెప్పడానికి ఇవి జస్ట్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో వుంది.. నాగార్జున సాగర్ డ్యామ్ ప్రమాద పరిస్థితులో వుందన్న వార్తలు నిత్యం వింటూనే వున్నాం.
ఇంతలోనే, తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన ఓ బ్యారేజ్ తాలూకు వంతెన కుంగిపోయింది. వంతెనలోని కొన్ని పిల్లర్లు కుంగిపోవడంతో మొత్తం ప్రాజెక్టు నాణ్యతపై అనుమానాలు పెరుగుతున్నాయి.
కేసీయార్ కుటుంబ అవినీతికి ఇదే నిదర్శనమంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అసలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయ్.. ఈ సమయంలోనే, ఆ బ్రిడ్జి కుంగిపోవాలా.? సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో అధికార పార్టీ అడ్డంగా ఇరుక్కుపోయింది.
నాణ్యతా లోపం వల్లనే బ్రిడ్జి కుంగిపోయిందన్నది నిర్వివాదాంశం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బ్యారేజీలోని నీటిని ఖాళీ చేయిస్తున్నారు. ఆ పిల్లర్లకు ఆనుకునే, డ్యామ్ గేట్లు కూడా వున్నాయి గనుక.. అవీ ప్రమాదంలో వున్నాయన్నది ఇంజనీర్ల అనుమానం.
వందల కోట్లు, వేల కోట్లు ఖర్చు చేసి నిర్మించే ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోంది.? ఇలాంటి పరిస్థితులకు నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు.?