ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నానని ప్రకటించారు. పోస్కో సంస్థను విశాఖలో అడుగుపెట్టనివ్వనని ప్రకటించారు. అంతేకాదు లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కర్మాగారంలో నిరుపయోగంగా ఉన్న 7 వేల ఎకరాల భూమిని విక్రయించడానికి ప్రభుత్వానికి అనుమతిస్తే విశాఖ ఉక్కు సంపన్నమవుతుందని, అప్పుడు దానిని ప్రైవేటీకరించవలసిన అవసరం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని తెలుస్తుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూడడం కోసం ప్రధానికి రాసిన లేఖలో విశాఖ ఉక్కు సమస్యకు తగిన పరిష్కార మార్గాలు వివరిస్తూ స్టీల్ ప్లాంట్ కు ఉన్న అప్పులు, బ్యాంకులకు చెల్లిస్తున్న వడ్డీలు, సొంత గనులు లేకపోవడం వంటి సమస్యలను వివరించానని, ఒడిస్సా లో ఇనుప ఖనిజం పుష్కలంగా ఉందని, అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఒక సొంత గనిని కేటాయిస్తే బాగుంటుందనే ప్రతిపాదన కూడా చేశానని, విశాఖ ఉక్కు నష్టాల నుంచి బయట పడడానికి కావలసిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వానికి సూచించానని సీఎం జగన్ స్వయంగా కార్మిక సంఘం నేతలకు తెలిపారు.
అసెంబ్లీలో సైతం విశాఖ ఉక్కు పై కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం పెడతామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందని కానీ స్టీల్ ప్లాంట్ ఎక్కడ మూత పడకుండా అంతకంటే మెరుగ్గా నిర్వహించాలని సీఎం జగన్ కార్మికులను కోరారు.కార్మికుల ఆందోళన వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడుతుందని, ఉత్పత్తి సక్రమంగా జరగడం లేదన్న మాట రాకుండా చూసుకోవాలని సీఎం జగన్ సూచించారు. విరామ సమయంలోనే ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. పరిశ్రమలు కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికులందరూ పై ఉందని స్పష్టం చేసిన ఆయన ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు