శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి… భక్తి, ఆనందం, ఆశీర్వాదాల సమ్మేళనం. దేశమంతా కృష్ణ నామస్మరణతో మార్మోగే ఈ రోజున.. పిల్లల భవిష్యత్తు బంగారు అక్షరాలతో రాయించుకోవచ్చని నమ్మకం చాలా మందికి ఉంటుంది. ఈ రోజు శాస్త్రాలు చెబుతున్న కొన్ని ప్రత్యేక పనులు చేస్తే.. ఈ పండుగను ఆధ్యాత్మికోత్సవం మాత్రమే కాకుండా, చిన్నారుల విద్య, కెరీర్, జీవన విజయాలకు పునాది వేస్తాయని పండితులు చెబుతున్నారు.
జన్మాష్టమి… కేవలం పూజా పర్వదినం మాత్రమే కాదు, కుటుంబ సుఖశాంతికి, ముఖ్యంగా పిల్లల పురోగతికి ఒక మహత్తర అవకాశం. ఈ రోజు కృష్ణ భగవంతుని స్మరించుకుంటూ చేసే పూజలు, మంత్రజపాలు, సేవాకార్యాలు త్వరిత ఫలితాలను అందిస్తాయని పండితులు చెబుతున్నారు. ఉదయం స్నానం చేసి ఇంటి పూజా స్థలంలో బాల గోపాలుని విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి, పిల్లలతో కలిసి వెన్న, పాలు, తులసి దళాలు సమర్పిస్తే, వారి జీవితంలో భగవంతుని కృప కురుస్తుందని చెబుతారు.
పండితుల అభిప్రాయం ప్రాకారం.. జన్మాష్టమి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని పిల్లలు 108 సార్లు జపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందంట.. చదువుపై ఆసక్తి పెంపొందుతుందని నమ్మకం. తల్లిదండ్రులు కూడా ఈ జపంలో పాలుపంచుకుంటే కుటుంబమంతా సానుకూల శక్తితో నిండిపోతుందని అంటున్నారు. అంతేకాదు జన్మాష్టమి నాడు పేద పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు, చదువుకోసం అవసరమైన వస్తువులు దానం చేయడం ఎంతో శుభప్రదమని చెబుతున్నారు. ఇది తమ పిల్లల కెరీర్‌లో ఉన్న అడ్డంకులను తొలగించడమే కాక, వారిలో సేవాభావం, దయాభావం పెంచుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రి గంధపు తిలకం పెట్టి, తులసి మాలను ధరింపజేస్తే చెడు దృష్టి నుంచి రక్షణ లభిస్తుందని అంటున్నారు.
ఇక ఈరోజు పిల్లలకు శ్రీకృష్ణ జననకథ చెప్పడం కూడా ప్రత్యేకమైంది. ఇది వారిలో న్యాయం, ధైర్యం, కరుణ వంటి విలువలను పెంచుతుంది. శాస్త్రాలు చెబుతున్నట్లుగా, అష్టమి తిథి అనంత శక్తికి ప్రతీక. శ్రీకృష్ణుడు స్వయంగా ఎనిమిదవ బిడ్డగా జన్మించడమే దీనికి నిదర్శనం. ఈ రోజున చేసే సత్కార్యాలు పిల్లల జీవితంలో ఆ శక్తిని సక్రియం చేసి, విజయపథంలో నడిపిస్తాయని పండితులు చెబుతున్నారు.
