తెలంగాణలో జనసేన పోటీ… నమ్మాలంతే!

జనసైనికులపాలిట లిపిలేని భాషలా, అర్ధం లేని వాక్యంలా, అర్థంకాని అక్షరంగా మారిపోతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాల్లో ఆయన తీరేమిటో, తీరం ఏటో, లక్ష్యం ఏమిటో, గమ్యం ఎటువైపో తెలుసుకోలేక జుట్టుపీక్కుంటూ పిచ్చోళ్లైపోతున్నారు. ఆ ఏపీలో పవన్ చేసే రాజకీయాలే అర్ధంకాక అల్లల్లాడుతుంటే… మరోవైపు తెలంగాణలో పోటీచేస్తే ఎలా ఉంటుంది? అనే విషయమై మీటింగులు పెడుతున్నారు పవన్!

అవును… నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా… తెలంగాణలో పోటీచేయడంపై పవన్ దృష్టిసారించారు. ఏపీలో… రేపటి ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది జనసేనే అని ఒకసారి.. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఖాయమని మరోసారి ప్రకటిస్తూ… కన్ ఫ్యూజన్ పాలిటిక్స్ చేయడంలో పీ.హెచ్.డి. చేసినా పవన్… తెలంగాణలో పోటీచేసే విషయమై తెలంగాణలోని జ‌న‌సేన నేతలతో సమావేశమయ్యారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సన్నాహక సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ప్రసంగించిన పవన్… నేతలను, శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయటంలో భాగంగా దిశానిర్దేశం చేశారట.

కాసేపు వాస్తవాలు మాట్లాడుకుంటే… పవన్ రాజకీయమంతా ఏపీలోనే సాగుతోంది. తెలంగాణలో ఇంతవరకు ఎక్కడా పర్యటించిందీ లేదు.. సమస్యలపై సరిగ్గా స్పందించిందీ లేదు. ఏదో వారాహి వాహనానికి పూజలు చేయించినప్పుడు జనాలను ఉద్దేశించి నాలుగు మాటలు మాట్లాడటం తప్ప.. ఇక్కడ చేసిన రాజకీయమంటూ ఏమీ లేదు! స్థానికంగా… ఏ జిల్లాలోనూ పర్యటించిందిలేదు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టిందీలేదు. అయినా పర్లేదు… ఇక్కడ కూడా ఒకసారి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకోవడంలో తప్పు లేదు.

అయితే… ఇక్కడ పవన్ ఎవరిపై విమర్శలు చేస్తారు? ఎవరిని తప్పుపడతారు? ఇంతకాలం ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ నా… లేక తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నా… ఏపీలో మిత్రపక్షంగా ఉన్న బీజేపీనా? ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి కదా! బీజేపీ ని తిట్టే పరిస్థితి ఉండదు! కేసీఆర్ ని విమర్శించే అంత సన్నివేశం లేదు! ఇక మిగిలింది కాంగ్రెస్… కాంగ్రెస్ ని ఏమని తిడతారు? అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ రెండు దఫాలుగా ప్రతిపక్షంలోఉన్న పార్టీపై ఏమని విమర్శలు చేస్తారు? ఇక మిగిలింది… షర్మిళ పార్టి! ఇక ఆమె పార్టీపైన చేయాలి ఏమైనా విమర్శలు చేస్తే…! అది కూడా… ఏపీలో మీ అన్న పాలన బాగాలేదు.. ఇక్కడ నువ్వేమిటమ్మా చేసేది? అని!!

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏమి మాట్లాడకుండా పవన్ చేయబోయే రాజకీయం ఏమిటన్నది ఆయనకైనా అర్ధమై ఉండాలి. పవన్ రాజకీయంగా హోప్స్ పెట్టుకున్నది ఏపీపై. ఇప్పటివరకూ పొత్తులనీ, లోపాయకారీ ఒప్పందాలని, చక్రాలు తిప్పామని చెప్పుకుంటుంది ఏపీలోనే. అక్కడ.. పవన్ ఎప్పుడు వారాహీ వేసుకుని వస్తారు.. జనాల్లో ఎప్పుడు తిరుగుతారు.. ఒకపక్క జగన్ – చంద్రబాబు లు ఇప్పటికే ఎన్నికల పనులు మొదలెట్టేశారని జనసైనికులు టెన్షన్ పడుతుంటే… పవన్ మాత్రం హైదరాబాద్ లో షూటింగుల్లో బిజీగా ఉంటూ… తెలంగాణలో ఎన్నికల్లో పోటీచేస్తే ఎలా ఉంటుందనే విషయాలపై మీటింగులు పెడుతున్నారు.

దీంతో… పవన్ కి తిక్కుందనే మాట అవాస్తవం కాదని… పదం సేం కాకపోయినా… కాస్త అలాంటిదేదో ఉందని కామెంట్లు చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్! ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు… వీలైనంత త్వరగా హైదరాబాద్ లో పనులు చక్కబెట్టుకుని ఏపీకి రావాలని, రోడ్డెక్కాలని, ప్రజల్లోకి వెళ్లాలని పిలుస్తున్నారు జనసైనికులు! మరి పవన్ వారి మాట ఈసారైనా వింటారా? లేక, జుట్టు పైకి ఎగరేసి… ఒక చిరునవ్వు నవ్వి లైట్ తీసుకుంటారా అన్నది వేచి చూడాలి!