ఏమైంది జనసేనాధిపతికి? పార్టీ పెట్టిన ఆరు సంవత్సరాల తరువాత కూడా పార్టీకి అసలు పునాదులే ఏర్పడపోవడానికి కారణాలు ఏమిటి? ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చెయ్యడం, అధికారాన్ని చేపట్టాలనుకోవడం సహజం. సామాన్యజనంలో పెద్దగా పరిచయం లేనివారైనా మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ మొదటి విడతలోనే ఎన్నికల్లో రెండు వందల స్థానాలకు పైగా తన అభ్యర్ధులని నిలబెట్టారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్క సీటు కూడా గెలవలేమని తెలిసినా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో అయినా పోటీ చేస్తాయి. అసలు ఆంధ్రాలో పేరే తెలియని ఎక్కడో ఉత్తరప్రదేశ్ కు చెందిన బహుసమాజ్ పార్టీ కూడా ఎన్నికల్లో తలపడుతుంది. మరి లక్షలాది అభిమానగణం, గ్లామర్, పలుకుబడి, పెద్ద కుటుంబ నేపధ్యం కలిగిన పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే గజగజ వణికిపోతున్నాడు!
పవనుడి అసలు లక్ష్యం వేరు!
నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు తెలివితక్కువతనం, సోమరితనం జనసేన పాలిటి శాపాలు. పవన్ కు దృఢచిత్తం లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలతో కలిసి పొత్తు పెట్టుకుని పోటీ చెయ్యకుండా అతి పెద్ద తప్పు చేసాడు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగి తన గొయ్యిని తానే తవ్వుకున్నాడు. రెండు స్థానాల్లో పోటీ చేసి ఘోరంగా పరాభవించబడ్డాడు. నిజానికి అంత అవమానం మరొకరికి ఎదురైతే దుకాణాన్ని మూసేసి వెళ్ళిపోయేవారు. కానీ, పవన్ “లక్ష్యం” అది కాదు కదా! ఆయన లక్ష్యం తాను ముఖ్యమంత్రి కావడం కాదు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా చూడడం. అందుకోసం ఓట్లను చీల్చి తెలుగుదేశం పార్టీకి మేలు చెయ్యడం! తన దుర్నిర్ణయానికి తనను నమ్ముకున్న లక్షలమంది బలైపోతారని తెలిసినా ఆయన లక్ష్యం అదే.
ఢిల్లీలో ఘోరావమానం!
మొన్న దుబ్బాకలో, గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు. కనీసం బీజేపీతో పొత్తు ధర్మాన్ని అనుసరించి వారికోసం ప్రచారం చెయ్యలేదు. పైగా “పవన్ తనంతట తానే మాతో పొత్తుకోసం వచ్చాడని” తెలంగాణ బీజేపీ నాయకులు ప్రకటించినా దాన్ని ఖండించలేదు! ఢిల్లీ చలిలో బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా దర్శనం కోసం కలవడానికి రెండురోజులు ఎదురుచూపులు చూసేట్లు చేసినా, అమిత్ షా ఇంటి గడప తొక్కే అవకాశం రాకపోయినా, ఆ దుర్భర అవమానాన్ని దిగమింగుకున్నాడు! అదేసమయంలో కొత్తగా రెండోసారి చేరిన విజయశాంతి ఢిల్లీ వెళ్లి అగ్రనేతలందరితో స్వాగతాలు పలికించుకున్నా, నీరాజనాలు అందుకున్నా, సన్మానాలు చేయించుకున్నా, ఏకసేనుడి నరాలు చలించలేదు! తాను వర్తమానకాలపు హీరో. విజయశాంతి గతకాలపు హీరోయిన్. అయినప్పటికీ విజయశాంతికి దక్కిన గౌరవ మర్యాదలు తనకు దక్కకపోయినా జనసేనుడి ఆత్మగౌరవం చచ్చుబడిపోయింది! ఏమా మహాత్మ్యం??
బీజేపీ చేతిలో కీలుబొమ్మ
ఇక బీజేపీ నాయకత్వం పవన్ కళ్యాణ్ ను పిచ్చోడిని చేసి ఆడిస్తున్నదని జనసైనికులు కుమిలి కుమిలి పోతున్నారు. తిరుపతి ఉపఎన్నికే అందుకు సాక్ష్యం. తిరుపతిలో ఎప్పుడో పుష్కరం క్రితం తమ అగ్రజాతుడు గెలిచాడు కాబట్టి ఆ స్థానం తమకు ఇవ్వాలనే ఒక చొప్పదంటు ప్రతిపాదన చేశారట పవన్ కళ్యాణ్! అంటే అప్పుడెప్పుడో చిరంజీవి అక్కడ గెలిస్తే ఆ సీటు శాశ్వతంగా మెగా కుటుంబానికి అప్పగించినట్లా? మరి అదే చిరు తన సొంతగ్రామం పాలకొల్లులో తిరస్కరించబడ్డాడు. ఆ లెక్కన ఇక జనసేన అసలు పాలకొల్లులో పోటీ చెయ్యనే కూడదు! పాలకొల్లు పక్కనే భీమవరంలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ దారుణ ఓటమికి గురయ్యాడు. ఇక జీవితంలో భీమవరంలో జనసేన పోటీ చెయ్యకూడదు మరి. అలాగే గాజువాకలో కూడా మరి! ఇంత పేలవమైన ఆలోచనలతో కునారిల్లిపోతున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ కు పావలా విలువ కూడా దక్కడం లేదు. తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని సోము వీర్రాజు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ కు బీజేపీలో అస్సలు చిల్లిగవ్వ గౌరవం కూడా లేదని మరోసారి స్పష్టం అయింది. బీజేపీ గెలవాల్సిన అవసరాన్ని గుర్తించి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చెయ్యలేదని జనసేన అన్నదట! రేపు తిరుపతి ఉప ఎన్నికలో కూడా జనసేన పోటీ చెయ్యకపోతే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది కేవలం పాకేజీలకోసమే అని రూఢి అవుతుంది!
పాకేజీలకోసమే తప్పులమీద తప్పులు
ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు. జనసేనకు రాజకీయంగా భవిష్యత్తు లేదు. మరో ఒకటి రెండేళ్లలో జనసేన దుకాణానికి తాళాలు పడటం తధ్యం. ఒకసారి తప్పు చేస్తే పొరపాటు. రెండోసారి చేస్తే గ్రహపాటు. మూడోసారి చేస్తే అలవాటు. కానీ, ఇక్కడ జనసేనుడు చేసే తప్పులన్నీ కావాలని చేస్తున్నవే అని, పాకేజీలకోసమే అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఒకసారి చర్మం మీద మచ్చ పడిన తరువాత అది చెరిగిపోదు!