పవన్‌పై సోషల్ మీడియా దాడులు.. పోలీసులకు ఫిర్యాదు..!

పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జనసేన పార్టీ స్పందించింది. తాజాగా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా వేడి రేపుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో 21 ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించుకున్న జనసేన… ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక ముఠాలు సోషల్ మీడియాలో నిందలు, అవమానకర వ్యాఖ్యలతో పవన్‌ను టార్గెట్ చేస్తున్నాయని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు.

తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ యోగాసనాలు వేస్తున్న ఫొటో ఒకటి ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ అయింది. అదే ఫొటోను దుర్వినియోగం చేస్తూ, “Random Forest” అనే ఖాతా నుంచి పవన్ స్థానంలో కుక్క ఫొటో పెట్టి అశ్లీలమైన, దూషణాత్మకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టు వైరల్ కావడంతో జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించిన జనసేన నాయకులు, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జనసేన నేతలు ఈ వ్యవహారాన్ని చట్టపరంగా తేల్చాలని నిర్ణయించారు. ఇలాంటి అవమానకర ప్రచారాలు రాజకీయ కుట్రలో భాగమేనని పార్టీ నేతలు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ప్రజలు గెలిపించారని, కానీ కొంతమంది ఇప్పుడు ఆయన్ను ఆన్‌లైన్‌లో టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని దూషణలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు.

గతంలో కూడా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్, ఫేక్ పోస్టులు చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2025 ఫిబ్రవరిలో బాపట్లలో ఒక వ్యక్తి ఆయనపై అవమానకర వ్యాఖ్యలు చేయగా, కేసు నమోదైంది. అదే ఏడాది ఏప్రిల్‌లో కర్నూల్ జిల్లాకు చెందిన మరో యూజర్ పవన్ కుమారుడి ఫోటోను కలుపుకుని నిందలు పెట్టిన పోస్టు వైరల్ చేశాడు. గుంటూరు పోలీసులు అప్పట్లో అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో సోషల్ మీడియాలో రెచ్చిపోతుండటంపై జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ పోస్టులకు తగిన శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది.