అవకాశాలకోసం ఎంతోమంది అర్రులు చాస్తుంటారు. కానీ భగవంతుడు ఒక్కరికో ఇద్దరికో ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందుకున్నవారు కొందరు దుర్వినియోగం చేసుకుని ప్రజలతో ఛీకొట్టించుకుంటారు. మరికొందరు ఆ స్వల్పసమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద ఎల్లో మీడియా జరిపిన దుష్ప్రచారం ప్రజల మనసుల మీద పనిచేసి అధికారానికి దూరంగా ఉంచారు. అంత గొప్ప సువర్ణావకాశాన్ని ఇచ్చిన ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ చంద్రబాబు దోపిడీకి తెరతీశారు. తన పార్టీవారికి, బంధువులకు, వివిధ రాజ్యాంగ వ్యవస్థలలో ఉన్నవారికి భూములు, కాంట్రాక్టులు కట్టబెట్టి, చివరకు కేవలం తన సామాజికవర్గం వారికి మాత్రమే పరిమితమయ్యేలా ఒక భ్రమరావతిని నిర్మించబూనారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల పొట్టలు కొట్టారు. దళితులను, వెనుకబడిన వర్గాలను చిన్నచూపు చూశారు. ఒక్క ప్రాజెక్ట్ కట్టించింది లేదు..ఒక్క పరిశ్రమ తెచ్చింది లేదు..కేవలం ప్రచారార్భాటంతో ఐదేళ్లూ, వందిమాగధులతో విలాసపర్యటనలు చేస్తూ జల్సాలు చేశారు. జ్ఞానం లేని కొడుకును మూడు శాఖలకు మంత్రిగా చేసి అవినీతికి హద్దులేకుండా దోచుకున్నారు. చంద్రబాబు నిజస్వరూపాన్ని గమనించిన ఓటర్లు ఆయనకు, ఆయన పార్టీకి కర్రు కాల్చి వాతలు పెట్టి జగన్మోహన్ రెడ్డి మెడలో విజయమాలను ధరింపజేశారు.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది మొదలు ప్రజాసంక్షేమానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు వేస్తూనే మరొకవైపు తండ్రి అడుగుజాడల్లో పేదల కడుపులు నింపడానికి నవరత్నాలలోని ముఖ్యమైన హామీని అమలు చెయ్యడం మొదలు పెట్టారు. మాటలు చెప్పడం కాదు, ఆచరణలో కూడా చూపిస్తారు చిత్తశుద్ధి కలిగిన పాలకులు ఎవరైనా. గత ఏడాదిన్నరగా అమలు చేస్తున్న పధకాలు ఒక ఎత్తైతే మొన్న మొదలు పెట్టిన ముప్ఫయి ఒక్క లక్షలమంది పేదవారికి కులమతాలకు, పార్టీలకు అతీతంగా ఇళ్లస్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు మరొక ఎత్తు. సుమారు నాలుగు లక్షల రూపాయల విలువైన ఇంటిస్థలాన్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా పేదలకు పట్టాలు అందిస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు విరిసేట్లు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో ఇంతవరకూ ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి మహత్తర క్రతువు జరగలేదు. మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో కార్యరూపం దాల్చుతున్న ఈ పధకానికి కేంద్రసాయం కూడా ఉంటుంది. సందేహం లేదు. అయితే ఆచరణలో ఎవరు పెడుతున్నారు, ఎవరి చేతులమీదుగా జరుగుతున్నది అనేదే ప్రధానం.
విశేషం ఏమిటంటే…ఈ యాగ ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో మరొక పదిహేడువేల కొత్త కాలనీలు ఉద్భవించబోతున్నాయి. పేదలకు పంచుతున్న ఈ భూముల విలువ అక్షరాలా పాతికవేల కోట్ల రూపాయలు! ఒక్కొక్క ఇంట్లో కనీసం ముగ్గురు లేదా నలుగురు నివసిస్తారనుకున్నా, ఈ పధకం వలన సుమారు కోటిమంది జనాభా లబ్ది పొందుతారు. ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో దాక్కుని జగన్ ఇస్తున్న ఇళ్ళు బాత్ రూములంత ఉన్నాయి…బెత్తెడు సైజులో ఉన్నాయి అంటూ కుత్సిత విమర్శలు చేసేవారు లబ్ధిదారుల ముందుకు వెళ్లి తమ పాలనలో తాము పేదలకోసం నిర్మించిన తాజ్ మహళ్లను ప్రదర్శిస్తే బాగుంటుంది. నిన్నా మొన్నా పట్టాలు అందుకుంటున్న మహిళల కళ్ళలో కనిపించిన ఆనందబాష్పాలను మనసుతో చూస్తే జగన్ పేదలకు అందిస్తున్న ఉపకారం విలువ ఏమిటో తెలుస్తుంది. అద్దాలమేడల్లో కూర్చుని రాళ్లు విసిరే అక్కుపక్షులకు బీదల కన్నీటి విలువ ఎలా తెలుస్తుంది?
ఈ ఒక్క పథకంతో జగన్మోహన్ రెడ్డి జనుల హృదయపు కోవెలలో తిష్ట వెయ్యడం తధ్యం. అదే ఇప్పుడు చంద్రబాబు, ఆయన చెంచాల ఆవేదన!
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు